హుజూరాబాద్‌లో పైసలాట మొదలైంది : బండి సంజయ్

టీఆర్ఎస్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రాజకీయ ప్రక్షాళన ప్రారంభమైందని.. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు రాబోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు రోజులు దగ్గర పడుతున్నాయని హెచ్చరించారు. టీఆర్ఎస్‌ పార్టీని ఎదురుకునే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ అని మరోసారి స్పష్టం చేసారు.

వరంగల్ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌లో బండి సంజయ్‌ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రగతి భవన్‌ తెలంగాణ ద్రోహులకు అడ్డాగా మారిందని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్‌ ఒక గడిలా పార్టీ అని.. నిజాంను మైమరిపించే విధంగా ఒక రాక్షస నిరంకుశ పాలన కోనసాగిస్తున్నదని ధ్వజమెత్తారు. గడీల పాలనను తట్టుకోలేక బయటకు వచ్చిన వారు అవినీతి పరులా? అని ఈ సందర్భంగా బండి సంజయ్‌ ప్రశ్నించారు.

ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ నీచంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఈటల పరిస్థితే ఇలా ఉంటే మిగితా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల, నాయకుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉద్యమకారులకు రక్షణ కల్పించే పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైసలాట ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను తీస్తున్నామని బండి సంజయ్ హెచ్చరించారు.