తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది..మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేసిఆర్..అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టారు. మొదట లిస్ట్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ లిస్ట్ లో దాదాపు 80 మంది అభ్యర్ధుల పేర్లు ఉంటాయని తేలింది. ఇక ఈ మొదట లిస్ట్ లో మంత్రి గంగుల కమలాకర్ పేరు ఉండటం ఖాయమని తెలుస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో మళ్ళీ గంగుల పోటీ చేయడం ఖాయం.
ఇక అటు కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేస్తారా? వేరే నేత పోటీ చేస్తారా? క్లారిటీ లేదు.ఇటు బిజేపి నుంచి బండి సంజయ్ పోటీ చేయడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. బండి బరిలో ఉంటే..ప్రధాన పోటీ బిఆర్‌ఎస్, బిజేపిల మధ్యే ఉంటుంది. దీంతో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది. అయితే కరీంనగర్ అసెంబ్లీ చరిత్ర ఒకసారి గమనిస్తే..1972లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొదట కాంగ్రెస్ హవా నడిచింది..1985 నుంచి టిడిపి జోరు కొనసాగింది. 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో టిడిపి గెలిచింది.
2009లో టిడిపి నుంచి గెలిచిన గంగుల కమలాకర్ తర్వాత బిఆర్‌ఎస్ లోకి వెళ్లారు. అక్కడ బలమైన నేతగా ఎదిగారు. 2014లో బిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి..బండి సంజయ్ పై గెలిచారు. 2018 ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. 14 వేల ఓట్ల మెజారిటీతో బండిపై గంగుల గెలిచారు.
కేసిఆర్ కేబినెట్ లో మంత్రి అయ్యారు..దూకుడుగా ముందుకెళుతున్నారు. అటు అభివృద్ధి పనులు చేస్తున్నారు. రాజకీయంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇక బండి సంజయ్ 2018లో ఓడిన తర్వాత 2019లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. ఆయన బిజేపి అధ్యక్షుడుగా పనిచేసి సత్తా చాటారు. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంటే గంగుల, బండి బలమైన నేతలే..దీంతో ఈ సారి కరీంనగర్ లో హోరాహోరీ పోటు ఉంటుంది. మరి ఈ సారి ఎవరు పైచేయి సాధించి..కరీంనగర్ కింగ్ అవుతారో చూడాలి.