తెలంగాణలోని బీసీ విద్యార్థులకు శుభవార్త

-

తెలంగాణలోని బీసీలకు రాష్ట్ర బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుభవార్త తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రతి నియోజకవర్గానికి బీసీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆదివారం మహాత్మా జ్యోతిబా పూలే 195వ జయంతి సందర్భంగా ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి గంగుల కమలాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 

అనంతరం మాట్లాడుతూ… దేశంలో ఎక్కడాలేని విధంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మెత్తం 119 బీసీ స్టడీ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నడుంబిగించిందని అన్నారు.ఈ బీసీ స్టడీ సెంటర్లను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రారంభించే విధంగా కార్యాచరణ రూపొందించామన్నారు. వీటి ద్వారా వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ ఇవ్వడంతో పాటు, స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చి విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందిస్తామని పేర్కొన్నారు. ఈ స్టడీ సెంటర్లను ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా సంక్షోభ సమయంలో ప్రత్యక్షంగా పాఠాలు వినలేని పరిస్థితులు నెలకొన్నాయని… భవిష్యత్తులో సైతం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ణానంతో బీసీ స్టడీ సర్కిళ్లలో బోధనలు ఉంటాయని అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ స్టూడియోని ప్రారంభించడం జరిగిందని… ఈ స్టూడియోలో రూపొందించిన పాఠాల్ని యూట్యూబ్ ద్వారా ప్రసారం చేస్తామన్నారు. బీసీ స్టడీ సెంటర్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు కార్డుల ద్వారా డిజిటల్ పాఠాల్ని సైతం ఆక్సెస్ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా స్టడీ సెంటర్ల ప్రాంగణంలో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటికీ దాదాపు 15,214 మంది విద్యార్థులు స్టడీ సర్కిళ్లలో శిక్షణ తీసుకొని ఎంతో మంది వివిధ ఉద్యోగాలను సాధించినట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news