సాగర్ బైపోల్ సీఎం కేసీఆర్ సభను టార్గెట్ చేసిన కాంగ్రెస్,బీజేపీ

-

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది. సిఎం కేసీఆర్ సభ పెట్టి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఐతే… ఆ సభను టార్గెట్ చేసుకున్నాయ్ కాంగ్రెస్, బిజెపిలు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయ్. కరోనా కేసుల నేపథ్యంలో తిరుపతిలో ఏపీ సీఎం జగన్ సభ రద్దు చేసుకోవడంతో దాన్ని బేస్ చేసుకుని కొంతమంది ఏకంగా కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

సాగర్ ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అగ్రనేతలు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఒకరి మీద మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం ఈ నెల 15న ముగియనుంది. 14న ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం ఇప్పటికే గ్రామాల్లో ప్రచారం ఊపందుకుంది. సభ కోసం ఓ వైపు ఏర్పాట్లు సాగుతున్నాయ్. మరోవైపున కెసిఆర్ సభను రద్దు చేసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కరోనా పేరుతో సభ రద్దుకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే కరోనా నేపథ్యంలో తిరుపతి ఎన్నికల సందర్బంగా జగన్ బహిరంగ సభను రద్దు చేసుకున్నారు. తెలంగాణలో కూడా కరోనా విస్తరిస్తోంది. హాలియా సభకు లక్షలాదిగా జనాన్ని తరలించడం వల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉంటుందంటున్నారు.

ఇకపోతే సిఎం కేసీఆర్ రెండోసారి సాగర్ పర్యటనకు రావడం అంటే ఓడిపోయామని డిసైడ్ చేసుకున్నట్లేనని ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఒక్క ఉప ఎన్నిక కోసం క్యాబినెట్ అంతా ఇక్కడే ఉందని మండిపడ్డారు.
మరోవైపు కరోనా వ్యాప్తి చెందుతుండడం వల్ల సిఎం కేసీఆర్ హాలియాలో సభను రద్దు చేయాలంటూ ఆదేశించాలంటూ కొంతమంది ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

బీజేపీ నేత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రోడ్ షోలతో మరొ వైపు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.మరి ఎన్నికల కమిషన్ సీఎం కేసీఆర్ హాలియా సభపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news