బ్రేకింగ్; విజయవాడలో ఫిబ్రవరి 2న జనసేన బిజెపి లాంగ్ మార్చ్

103

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న జనసేన, బిజెపి పార్టీలు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఫిబ్రవరి 2 న విజయవాడలో లాంగ్ మార్చ్ చేయనున్నాయి. ఈ విషయాన్ని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తాడేపల్లి నుంచి విజయవాడ వరకు ఈ లాంగ్ మార్చ్ ఉంటుందని పేర్కొన్నారు.

రాజకీయాలను వైసీపీ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటుంది అని నాదెండ్ల ఆరోపించారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన బిజెపి, జనసేన నేతలు, ఏ పోరాటం అయినా సరే బిజెపి జనసేన కలిసే చేస్తాయని స్పష్టం చేసారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుత౦ ఢిల్లీలోనే ఉన్న పవన్ కళ్యాణ్ రేపు ఉదయం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను కలవనున్నారు. నేడు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి,

నిర్మలా సీతారామన్ ని కలిసిన ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. అసలు అమరావతి మార్చడానికి కేంద్ర౦ మద్దతు ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇందుకోసం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు.