హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్ గూటికి బీజేపీ లీడ‌ర్లు.. ప‌క్కా ప్లాన్‌తోనే?

అస‌లు హుజూరాబాద్‌లో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌కుండా ఉంది. ఈట‌ల వ‌ర్సెస్ టీఆర్ ఎస్ అన్న‌ట్టు రెండు వ‌ర్గాలుగా కేడ‌ర్ చీలిపోయింది. వీరిద్ద‌రి మ‌ధ్య‌నే ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాలు న‌డిచాయి. అయితే ఇప్పుడు మ‌ధ్య‌లోకి బీజేపీ ఎంట‌ర్ అయింది. ఈట‌ల రాజేంద‌ర్ ఎప్పుడైతే బీజేపీ కీల‌క నేత‌ల‌తో చర్చ‌లు జ‌రిపారో అప్ప‌టి నుంచి బీజేపీపై ఫోక‌స్ పెట్టింది టీఆర్ ఎస్‌.

టీఆర్ ఎస్ కేడ‌ర్‌ను మొత్తం త‌మ‌వైపు తిప్పుకున్న అధిష్టానం.. ఎలాగైనా ఈట‌ల‌ను ఒంటరి చేయాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే ఈట‌ల వెంట ఉంటున్న వారితో బేర‌సారాలు సాగిస్తూ మ‌లుపుకుంటోంది.

ఇప్పుడు బీజేపీలో ఈట‌ల చేర‌తార‌నే అనుమానంతో బీజేపీని ఖాళీ చేసేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీసింది. ఇప్ప‌టికే బీజేపీకి చెందిన 11వ వార్డు కౌన్సిలర్‌ దండ శోభ, 18వ వార్డు కౌన్సిలర్‌ ప్రతాప మంజూలలు టీఆర్‌ఎస్ కండువా క‌ప్పుకున్నారు. వారితో పాటు సింగిల్‌ విండో చైర్మన్‌ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన సింగిల్‌ విండో డైరెక్టర్లు దండ భాస్కర్‌రెడ్డి, ప్రతాప ఆంజనేయులు గులాబీ గూటికి చేరారు. దీంతో ఈట‌ల‌కు ఏ పార్టీలో చేరినా కేడ‌ర్ లేకుండా చేయాల‌ని టీఆర్ ఎస్ చూస్తోంది.