ఆ న‌లుగురు సౌత్ సినిమా స్టార్ల‌పై క‌మ‌లం క‌న్ను…?

-

దక్షిణాదిలో పాగా వేసేందుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టేసింది. ఇప్పటికే కర్ణాటకలో పాగా వేసిన కమలం పార్టీ మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేందుకు చూస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాదిలో ఓటర్లను ఆకర్షించేందుకు సినిమా స్టార్ లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొన్న సాధారణ ఎన్నికల్లో ఘన విజయంతో మంచి దూకుడు మీద ఉన్న బిజెపి తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిలోనూ బలమైన రాజకీయ పార్టీగా ఎదిగేందుకు బిజెపి ఇప్పటినుంచే పక్కా ప్రణాళికలతో దూసుకుపోతోంది. కర్ణాటకలో బిజెపి ఇప్పటికే అధికారంలో ఉంది.

తమిళనాడులో మాజీ సీఎం జయలలిత మరణాంతరం అన్నాడీఎంకే లో నెలకొన్న వర్గపోరు తమకు అనుకూలంగా మలచుకునేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీలోకి చేర్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రజనీ మద్దతుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో బిజెపి ఉంది. ఈక్రమంలోనే రజనీకాంత్ కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కేరళలో సూప‌ర్‌స్టార్‌ మోహన్ లాల్ బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణకు చెందిన సినీ నటి విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న రాజకీయంగా ఆమె అంత యాక్టివ్ గా లేరు.

కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విజయశాంతి రేపోమాపో కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి తర్వాత ఆమె బిజెపిలోకి వెళ్తారు అంటున్నారు.  విజయశాంతితో పాటు తెలంగాణలో ఓ కీలక నేతగా ఉన్న వ్య‌క్తిని సైతం పార్టీలో చేర్చుకునేందుకు జాతీయస్థాయిలో రంగం సిద్ధం అవుతోందని తెలుస్తోంది.  ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవిని పార్టీలో చేర్చుకోవాలని బిజెపి పెద్దలు భావిస్తున్నారు.  చిరంజీవి కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని… అందుకే బిజెపికి అనుకూలంగా ఉన్న ప్రముఖుల‌తో ఆయన సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తోంది.

ఇక సాధారణ ఎన్నికల సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన హడావుడి బీజేపీ నాయకత్వానికి ఆగ్రహం తెప్పించిందని…. అందుకే చిరంజీవి తెలంగాణ గవర్నర్ త‌మిళ సైతో పాటు, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినా కేసీఆర్ హైదరాబాదులోని ఉన్నప్పటికీ ఆయనను పట్టించుకోలేదని ప్రచారం ఉంది. బిజెపిలో చేరడం ద్వారా రాజ్యసభ సీటు దక్కించుకోవచ్చు ఆలోచనలో చిరంజీవి ఉంటే… చిరంజీవి ద్వారా కాపుల ఓట్లు కొల్లగొట్టే ఆలోచనలో బిజెపి ఉన్నట్టు తెలుస్తోంది.  ఇక మహారాష్ట్ర ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు కూడా దక్షిణాదిపై పూర్తిగా దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఏదేమైనా వచ్చే రెండు మూడేళ్లలో దక్షిణాదిలో బలపడే లక్ష్యంతో ఎంతోమంది ప్రముఖులని పార్టీలో చేర్చుకుని ఎన్నో సంచలనాలకు తెరతీయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news