టీఆర్ఎస్‌పై క‌మ‌లం కొత్త అస్త్రం ఫ‌లిస్తుందా..!

-

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా తెలంగాణ‌లో పాగావేయాల‌ని చూస్తున్న క‌మ‌ల‌ద‌ళం అందుకు అనుగుణంగానే ప‌క‌డ్బందీ వ్యూహంతో ముందుకు వ‌స్తోంది. అధికార టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌న్న ల‌క్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకుంటోంది. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఉన్నాయి. ఒక‌వైపు ఆర్టీసీ కార్మికులు 32 రోజులుగా స‌మ్మె చేస్తున్నారు. వీరికి మ‌ద్ద‌తుగా కాంగ్రెస్‌, బీజేపీ, వామ‌ప‌క్షాలు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. అధికార టీఆర్ఎస్‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్నాయి.

అయితే, ఆర్టీసీ కార్మికుల స‌మ్మెను విర‌మింప‌జేసేందుకు సీఎం కేసీఆర్ అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. అవి ఫ‌లించ‌డం లేదు. మ‌రోవైపు.. త‌హ‌సీల్దార్ స‌జీవ‌ద‌హ‌నం ఘ‌ట‌న‌తో రెవెన్యూ ఉద్యోగులు కూడా ఆందోళ‌న బాట ప‌ట్టారు. మూడు రోజుల‌పాటు విధుల బ‌హిష్క‌ర‌ణ‌కు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నిజానికి.. ఈ ప‌రిస్థితులు సీఎం కేసీఆర్‌కు అత్యంత సంక్లిష్టంగా మారుతున్నాయి. ప్ర‌జ‌ల్లోనూ కొంత వ్య‌తిరేక భావ‌న ఏర్ప‌డుతోంది.

ఇక ప‌రిస్థితులను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకునేందుకు బీజేపీ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌ను దేశ రెండో రాజ‌దానిగా చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌ను వ్యూహాత్మ‌కంగా ముందుకు తీసుకొస్తోంది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మ‌హారాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్‌రావు చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల‌తోపాటు సామాన్య‌జ‌నంలోనూ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని, దీంతో  దేశ రెండో రాజ‌ధానిగా హైద‌రాబాద్‌ను చేయ‌డం మంచిద‌ని, ఈ మేర‌కు పార్టీల‌న్నీ ఏకాభిప్రాయానికి రావాల‌ని ఆయ‌న సూచించారు. ఇదే విష‌యాన్ని ఆనాడే అంబేద్క‌ర్ చెప్పార‌న్నారు.

ఈ మేర‌కు తెలంగాణ‌లోని పార్టీల‌న్నీ ఏకాభిప్రాయానికి రావాల‌ని సూచించారు. అయితే.. హైద‌రాబాద్‌పై ప‌ట్టుకోసం బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోందని, ఇదే స‌మ‌యంలో ఎంఐఎంను దీటుగా ఎదుర్కొన‌వ‌చ్చున‌న్న వ్యూహంతో ముందుకు వ‌స్తుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌ను దేశ రెండో రాజ‌ధానిని చేశార‌న్న సానుకూల భావ‌న ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతుంద‌ని, అది బీజేపీకి ఎంతో క‌లిసివ‌స్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికార టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో  చూడాలి. హైద‌రాబాద్ రెండో రాజ‌ధాని అయితే ఆ ఎఫెక్ట్ తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌పైనే ఎక్కువుగా ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news