తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆ కులాన్నే న‌మ్ముకుందా…!

-

నాటి స‌మైక్య రాష్ట్రంలో స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రాజ‌కీయ ఆధిప‌త్యం కేవ‌లం రెడ్డి సామాజిక వ‌ర్గం చేతుల్లోనే ఉంది. 1983లో ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన‌ప్ప‌టి నుంచి వెల‌మ వ‌ర్గానికి చెందిన జల‌గం వెంగ‌ళ‌రావు, బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి చెందిన పీవీ, ఎస్సీ అయిన దామోద‌రం సంజీవ‌య్య లాంటి నేత‌లు మిన‌హా అంద‌రూ రెడ్డి ముఖ్య‌మంత్రులే కొన‌సాగారు. ఇక టీడీపీ పుట్టాక ఆ పార్టీ నుంచి ముఖ్య‌మంత్రులు అయిన ఎన్టీఆర్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రు క‌మ్మ‌లే.. టీడీపీలో అంతా క‌మ్మ‌ల హ‌వానే న‌డిచింది. ఇక బ‌లంగా ఉన్న మ‌రో సామాజిక వ‌ర్గం కాపులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. కాపుల నుంచి చిరంజీవి ప్ర‌జారాజ్యం పెట్టినా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పెట్టినా అధికారంలోకి రాలేదు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోన్న బీజేపీ ఇప్పుడు రెండు చోట్ల కూడా కాపు వ‌ర్గాన్నే న‌మ్ముకుంది. ఏపీలో కాపు వ‌ర్గానికే చెందిన మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు బాధ్య‌త‌లు ఇచ్చింది. ఆయ‌న్ను త‌ప్పించి మ‌ళ్లీ అదే కాపు వ‌ర్గంలో స్పీడ్‌గా ఉన్న సోము వీర్రాజుకు ప‌గ్గాలు క‌ట్ట‌బెట్టింది. ఇక కాపుల‌ను త‌న వైపున‌కు తిప్పుకునేందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పొత్తు పెట్టుకుంది. ఓవ‌రాల్‌గా క‌మ్మ‌లు టీడీపీకి ఉంటార‌ని.. రెడ్లు వైఎస్సార్‌సీపీకి ఉంటార‌ని భావించిన బీజేపీ కాపుల‌తో రాజ‌కీయం చేస్తోంది.

ఇక తెలంగాణ‌లోనూ వెల‌మ‌లు, రెడ్ల‌ను కాకుండా బ‌లంగా ఉన్న కాపు వ‌ర్గాన్ని ఆక‌ట్టుకునే క్ర‌మంలోనే అదే వ‌ర్గానికి చెందిన క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌కు తెలంగాణ బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించింది. తెలంగాణ‌లో ఒక కాపు ఎంపీ గెల‌వ‌డ‌మే గ‌గ‌నం అనుకున్న టైంలో గ‌త ఎన్నిక‌ల్లో ధ‌ర్మ‌పురి అర్వింద్‌, బండి సంజ‌య్ ఇద్ద‌రు బీజేపీ నుంచి గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. దీంతో ఇక్క‌డ కూడా కాపుల్లో బ‌లంగా ఉన్న మున్నూరు కాపుల‌ను ఎంక‌రేజ్ చేస్తూ వ‌స్తోంది. కిష‌న్‌రెడ్డి లాంటి ఒక‌రిద్ద‌రు నేత‌ల‌తో పాటు కేసీఆర్‌కు పోటీ ఇచ్చేందుకు కొంద‌రు వెల‌మ నేత‌లు పార్టీలో ఉన్నా ప్ర‌ధానంగా మున్నూరు కాపుల‌తోనే ఇక్క‌డ బీజేపీ స‌రికొత్త క్యాస్ట్ స్ట్రాట‌జీ అమ‌లు చేస్తోంది. మ‌రి ఏపీ, తెలంగాణ‌లో బీజేపీ రాజ‌కీయానికి వీళ్లు కాపు కాస్తారా ? అన్న‌ది త్వ‌ర‌లో తేల‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news