కమలం పాలిటిక్స్: నామాని ఫిక్స్ చేస్తున్నారా?

-

నామా నాగేశ్వరరావు…తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. అదీగాక బడా వ్యాపారవేత్త. మధుకాన్ సంస్థ వ్యవస్థాపకుడైన నామాని బీజేపీ టార్గెట్ చేసిందా? అంటే ప్రస్తుతం ఆయన సంస్థలపై జరుగుతున్న ఈడీ సోదాలని బట్టి చూస్తే కాస్త అవుననే సమాధానం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తుంది. స్వతహాగా వ్యాపారవేత్త అయిన నామా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడుగా ఎదిగారు. 2009లో ఖమ్మం ఎంపీగా గెలిచారు. 2014లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.

ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుపున ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ముందు టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరి ఖమ్మం ఎంపీగా గెలిచారు. అయితే పార్లమెంట్ ఎన్నికల నుంచి తెలంగాణలో బీజేపీ బలపడటానికి చూస్తుంది. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన నాయకులని పార్టీలో చేర్చుకుంది. అలాగే మొన్న ఆ మధ్య దుబ్బాక ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్‌కు చెక్ పెట్టింది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో గులాబీ పార్టీకి దాదాపు చెక్ పెట్టినంత పనిచేసింది.

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో దారుణంగా ఓడిపోయినా సరే, తెలంగాణలో తామే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అని చెబుతోంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని చూస్తుంది. అందులో భాగంగానే అనూహ్య పరిణామాల మధ్య టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల రాజేందర్‌కు కాషాయ కండువా కప్పింది.

ఈటల వచ్చిన ఊపులో ఉన్న కమలం పార్టీ టీఆర్ఎస్‌లో బలమైన నేతలనీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎంపీ నామా కంపెనీ మధుకాన్‌లో ఇటీవల సోదాలు నిర్వహించింది. బ్యాంకులని మోసం చేసిన కేసులో తాజాగా నామాకు సమన్లు జారీ చేసింది. ఇక ఇదంతా చూస్తుంటే కమలం పార్టీ గేమ్ అని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్ధికంగా బలంగా ఉన్న నామాని ఇటు వైపుకు తిప్పుకోవడానికి కమలం వేసిన ఎత్తుగడ అని అంటున్నారు. మరి చూడాలి ఇది కమలం వ్యూహామో…లేక నామా వ్యాపారంలో ఉన్న ఇబ్బందులో.

Read more RELATED
Recommended to you

Latest news