ఖమ్మంలో కమలం…పొంగులేటితో ప్లస్?

-

2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుంటూ వస్తున్న బీజేపీ…వరుసపెట్టి ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి…ఇప్పుడు మునుగోడులో కూడా సత్తా చాటి టీఆర్ఎస్ పార్టీని నెక్స్ట్ అధికారంలోకి రాకుండా చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బలపడటమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది…టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని సైతం లాగేస్తుంది.

అయితే ఇలా నిదానంగా బలపడుతూ వస్తున్న బీజేపీ…తమకు ఏ మాత్రం బలం లేని దక్షిణ తెలంగాణపై ఫోకస్పెట్టింది…ఇక్కడ ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీకి బలం లేదు. ఇక నిదానంగా వరంగల్, నల్గొండ జిల్లాల్లో చేరికలతో బీజేపీ బలపడుతూ వస్తుంది. కానీ ఖమ్మంలో చేరికలు లేవు. పైగా ఇక్కడ బీజేపీకి బలమైన నాయకులు లేరు. అందుకే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని బలమైన నాయకులపై బీజేపీ ఫోకస్ పెట్టింది.

ఖమ్మంలో టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ…అందుకే ఆ పార్టీలోని బలమైన నేతలని లాగడానికి కమలం స్కెచ్ వేస్తుంది…అదే సమయంలో టీఆర్ఎస్ లో బలంగా ఉన్న నేతలపై కూడా ఫోకస్ చేసింది. పైగా టీఆర్ఎస్ లో కొందరు అసంతృప్తి నేతలు ఉన్నారు…వారిని బీజేపీలోకి తీసుకురావాలని చూస్తుంది. ఇదే క్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీలోకి లాగాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే ఇంతవరకు పొంగులేటి విషయంలో క్లారిటీ రాలేదు…కానీ అతి త్వరలోనే ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సమాచారం…మునుగోడు ఉపఎన్నిక తర్వాత పొంగులేటి బీజేపీలోకి రావొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో నెక్స్ట్ ఖమ్మంలో కొందరు ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ లో సీటు కష్టమని తెలుస్తోంది. అలా సీటు దక్కని ఎమ్మెల్యేలు కూడా నిదానంగా బీజేపీలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది…ఇక పొంగులేటి వస్తే ఖమ్మంలో బీజేపీకి ప్లస్ అవుతుందనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news