సబ్ కా సాత్ సభకా వికాస్-సంకల్పంతో దేశ అభివృద్ధికి అలుపులేని కృషి చేస్తున్న భారతీయ జనతాపార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ మేనిఫెస్టోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మేనిఫెస్టోను ప్రకటించారు. రానున్న మరో ఐదేళ్ళ వరకు పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తున్నామని వెల్లడించారు.అంబేడ్కర్ జయంతి నాడు మహా సంకల్పం తీసుకున్నామంటూ నరేంద్ర మోడీ-ఈ మేనిఫెస్టోకు సంకల్ప పత్రం అని నామకరణం చేశారు.ప్రజల ముందుకు తీసుకువస్తున్న ఎన్నికల హామీలను ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలోని భారతీయజనతాపార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ లతో కలిసి మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్ తో మొత్తం 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. మరో ఐదేళ్లు ఉచిత రేషన్ ఇస్తామని మోదీ ప్రకటించారు.
అలాగే 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్, 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ లో భాగంగా రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్యం, ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు, దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం, ట్రాన్స్ జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్, 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు, కూరగాయల సాగు, నిల్వ కోసం కొత్త క్లస్టర్లు నిర్మిస్తామని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు వంటి కీలక హామీలను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు.కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. ఈ మేనిఫెస్టో రూపకల్పన కోసం దాదాపు 15 లక్షల సలహాలు, సూచనలు పరిశీలించింది. తర్వాత పధ్నాలుగు స్లోగన్లను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక,సాంకేతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, సంతులిత అభివృద్ధి, క్రీడా వికాసం, సుస్థిర భారత్ అంటూ స్లోగన్‌లు చెప్పుకొచ్చారు.
మూడోసారి అధికారంలోకి వచ్చాక యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వందే భారత్ దేశంలోని ప్రతి మూలకూ విస్తరింపజేయడం, ప్రపంచ వ్యాప్తంగా తమిళ భాష ప్రతిష్టను పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతదేశాలకు నాలుగు బుల్లెట్ రైళ్లు నడుపుతామని హామీ ఇచ్చారు. 2036లో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మురం చేశామని, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంతోపాటు దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కల్పించి ఒకే దేశం, ఒకే ఎన్నికలు విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. రానున్న ఐదేళ్ళలో భారత్‌ను అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.