త్రిముఖ పోరులో వెనుకబడిన బీఆర్‌ఎస్‌.. ఇక కష్టమే!

-

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగిసింది. 62 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైంది. మొత్తం 17 స్థానాలు ఉండగా 10 స్థానాల్లో పోలింగ్‌ శాతం 70 దాటింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ శాతం పెరిగింది. అయితే రెండు రోజుల క్రితం వరకు రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉంటుందని అంతా భావించారు. కానీ పోలింగ్‌డే మాత్రం పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే రేసు నుంచి బీఆర్‌ఎస్‌ తప్పుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

brs-congress-bjp

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పార్టీ ఇబ్బందులు పడుతోంది. చాలా మంది నాయకులు పార్టీని వీడారు. వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవాల్సిన తరుణం వచ్చింది. ఓటమితో నైరాశ్యంలో ఉన్న గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్‌ బస్సు యాత్ర చేపట్టారు. దాదాపు 10 నియోజకవర్గాల్లో యాత్ర చేశారు. కానీ దాని ప్రభావం ఎన్నికల్లో పెద్దగా చూపలేదని తెలుస్తోంది.

ఇక తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు ఎక్కువగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే షేర్‌ చేసుకున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌వైపు కాస్త ఎక్కువ మంది మొగ్గు చూపారని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ఉండాలన్న అభిప్రాయంతో గ్రామీణులు కూడా ఈసారి బీజేపీకి ఓటు వేశారని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ప్రధాన పోటీ రెండు జాతీయ పార్టీల మధ్యే సాగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తోపాటు 16 స్థానాల్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో బీజేపీ–ఎంఐఎం మధ్య పోటీ నెలకొనగా మిగతా 16 స్థానాల్లో కాంగ్రెస్‌ – బీజేపీ మధ్యే నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగిందంటున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ సరళిని బట్టి ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ చెరి సగం పంచుకుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ 7 నుంచి 8 సీట్లు, కాంగ్రెస్‌ కూడా 7 నుంచి 8 సీట్లు గెలుస్తాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌ సీటు ఎంఐఎం గెలిచే అవకాశమే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలు నిజమైతే బీఆర్‌ఎస్‌కు ఇక కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news