సార‌థిగా బండి సంజ‌య్ అయితేనే క‌రెక్ట్‌.. ఆయ‌న నాయ‌క‌త్వ‌మే కావాలంటున్న కేడ‌ర్‌

-

తెలంగాణ బిజేపి అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ అయితేనే క‌రెక్ట్ అంటున్నారు ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు. ఆయ‌న అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలోనే తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌తి గ‌డ‌ప‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఏ పార్టీలోనైనా బండి సంజయ్ లాంటి నాయకుడు వుంటే బాగుండు అన్నంతగా ఆయన తన నాయకత్వ పటిమను చూపించారు. త‌న‌ వారికోసం ఎలా నిలబడతాడన్నది తెలుసు. తెలంగాణలో క్షేత్ర‌స్థాయి నుంచి సీనియ‌ర్‌ల వ‌ర‌కు సంజయ్‌ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు బిజేపి అంటే అదొక జాతీయ పార్టీ అనే అభిప్రాయం ఉండేది.

కానీ సంజ‌య్‌కి బాధ్య‌త‌లు ఇచ్చాక బీజేపీ ఒక మ‌హాశ‌క్తి అనేలా తీర్చిదిద్దారు. బిఆర్ఎస్ బ‌ల‌హీన‌ప‌డుతున్న వేళ కాంగ్రెస్‌కి క‌ళ్ళెం వేయాలంటే బిజేపి పుంజుకోవాలని క‌మ‌లం కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉండ‌గా కేసిఆర్‌కి కంటి మీద కనుకులేకుండా చేశారు సంజ‌య్‌. తెలంగాణ భవిష్యత్తు బిజేపే అనేంత‌గా జవసత్వాలు కల్పించిన ఆయ‌న‌ను అనూహ్యంగా అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు.

హైక‌మాండ్ నిర్ణ‌యాన్ని అప్ప‌ట్లో కార్య‌క‌ర్త‌లు ఖండించారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 8 సీట్లు గెలిచినా ఆ త‌రువాత పార్టీలో ఒక‌రికొక‌రి మ‌ధ్య దూరం పెరిగిపోయింది.అయితే పూర్వ‌వైభ‌వం రావాలంటే మ‌ళ్ళీ సంజ‌య్‌కే అధ్య‌క్ష బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని బీజేపీ కేడ‌ర్ కోరుకుంటోంది. కేంద్ర మంత్రిగా,రాష్ర్ట అధ్య‌క్షుడిగా ఆయ‌న స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయ‌గ‌ల‌ర‌ని కేడ‌ర్ న‌మ్మ‌కంగా ఉంది.

గ‌తంలో బండి సంజ‌య్ రాష్ర్ట అధ్య‌క్షుడిగా ఉన్న‌ సమయంలోనే దుబ్బాక ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో రఘునందన్‌ గెలుపు కోసం బండి సంజయ్‌ పడిన శ్ర‌మ అంతా ఇంతా కాదు.తానే పోటీ చేస్త‌న్నా అనేంత‌లా ప్ర‌జ‌ల్లోకి వెళ్ళారు. ఆ ఎన్నిక‌ల్లో బిజేపి శ్రేణులను ఆయన కదలించిన విధానం అందర్నీ ఆకర్షించింది.అలా బిఆర్‌ఎస్‌ విజయాల పరంపరకు మొదటిసారి బ్రేక్ వేశారు సంజ‌య్‌.

ఈ ఓట‌మి కెసీఆర్‌ను ఉలిక్కిప‌డేలా చేసింది. ఆ తర్వాత వచ్చిన హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇదే దూకుడును ప్ర‌ద‌ర్శించారు. గెలుపే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగి అడుగడుగునా బిజేపి జెండాలు ఎగురవేశారు. రోడ్‌షోలతో పెద్దఎత్తున ప్రజల దృష్టిని ఆక‌ర్షించి గ‌తం కంటే ఎక్కువ స్థానాల‌ను బీజేపీ ఖాతాలో వేశారు. ఇలా ప్ర‌తి అడుగు విజ‌యం వైపుగా క‌దిలింది. బండి సంజయ్‌ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని అనేక సార్లు తెలంగాణకు వచ్చారు. అనేక అభివృద్ది కార్యాక్రమాలలో పాల్గొన్నారు. ఆ మూడున్నర‌ సంవత్సరాల పాటు జాతీయస్ధాయి నాయకులను రాష్ట్రానికి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు.

తెలంగాణ‌లో పార్టీకి ఎప్పుడూ లేని వైభ‌వాన్ని జసంజ‌య్ తీసుకువ‌చ్చారు.ముఖ్యంగా యువతను పెద్దఎత్తున బిజేపి వైపు ఆకర్షితులయ్యేలా చేశారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలు పదే పదే వివాదాస్పదం చేసి, రాజకీయంగా ఆయనను ఎదుర్కొనలేక నైతికంగా దెబ్బతీయాలని చూశారు. కాని ఎక్కడా తగ్గలేదు. ఆయన నమ్మిన సిద్దాంతాన్ని వ‌ద‌ల‌కుండా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, తెలంగాణలో బిజేపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగారు.

ఆ స‌మ‌యంలో ఎక్క‌డ తేడా కొట్టిందో తెలియ‌దు కానీ సంజ‌య్‌ని అనూహ్యంగా అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించారు.రాజ‌కీయంగా అప్పుడు ఒక్క అడుగు వెన‌క్కి ప‌డినా ఆయ‌న మాత్రం త‌గ్గ‌లేదు.మ‌రోసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ మళ్లీ బిజేపి పగ్గాలు అప్పగిస్తే ఈసారి పార్టీని విజయ తీరాలకు చేర్చుతాడన్న విశ్వాసం కేడ‌ర్‌లో వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో బీజేపీ నేత‌లు ఎవ‌రికి వారు య‌మునా తీరు అనే విధంగా ఉన్నారు.

రాజ‌కీయం అంతా కాంగ్రెస్ కేంద్రంగా న‌డుస్తోంది. ఈ టైమ్‌లో సంజ‌య్‌ని బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కార్య‌క‌ర్త‌లు కోరుతున్నారు. రెండు ప‌ద‌వుల్లో ఉంటూ కేడ‌ర్‌కి ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూసుకుంటార‌నే న‌మ్మ‌కాన్ని కార్య‌క‌ర్త‌లు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. మ‌రి హైక‌మాండ్ ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news