కొడాలి చేతిలో కృష్ణా..జగన్ ఫిక్స్ చేశారా?

మంత్రి పదవి పోయాక చాలామంది నేతలు సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే..చాలామంది నేతలు అడ్రెస్ కూడా లేరు…అసలు మీడియాలో కొందరు నేతల పేర్లే వినిపించడం లేదు. కన్నబాబు, రంగనాథరాజు, శంకర్ నారాయణ, సుచరిత, ధర్మాన కృష్ణదాస్ లాంటి వారు అసలు కంటికి కనిపించడం లేదు. ఇంకొందరు మాజీ మంత్రులు అప్పుడప్పుడు మీడియాలో తళుక్కుమంటున్నారు. కానీ మంత్రి పదవి పోయినా సరే నిత్యం దూకుడుగా రాజకీయాలు చేయడంలో మాజీ మంత్రి కొడాలి నాని ముందు వరుసలో ఉన్నారు.

మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా దూకుడుగా రాజకీయం చేశారో అందరికీ తెలిసిందే..ఇక అదే దూకుడు పదవి పోయాక కూడా కొనసాగిస్తున్నారు. ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా చంద్రబాబుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇక వరుసగా జరుగుతున్న ప్లీనరీ సమావేశాల్లో తనదైన స్టైల్ లో బాబుపై విరుచుకుపడుతున్నారు. ఇక కొడాలి…బాబుని తిడుతుంటే వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు….అలాగే కార్యకర్తలు ఈలలతో మోత మొగిస్తున్నారు. అంటే కొడాలి స్పీచ్ లంటే అలా ఉంటాయని చెప్పొచ్చు.

ఇక స్పీచ్ మాత్రమే కాదు…జిల్లా రాజకీయాలపై కూడా తనకు పట్టు ఉందని కొడాలి నిరూపిస్తున్నారు. కృష్ణా జిల్లా మొత్తం కొడాలి చేతులోనే ఉన్నట్లు కనిపిస్తోంది. కొత్త కృష్ణా జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. గుడివాడ, గన్నవరం, పామర్రు, పెనమలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ స్థానాలు ఉన్నాయి. ఈ ఏడు స్థానాల్లో ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉంది కొడాలి నానికే…ఈ నియోజకవర్గంలోనైనా కొడాలి అభిమానులు ఉన్నారు. అందుకే ఎక్కడ ప్లీనరీ సమావేశం జరిగిన కొడాలి స్పీచ్ లకు స్పందన గట్టిగా వస్తుంది.

అదే సమయంలో ప్లీనరీ సమావేశాల్లో అభ్యర్ధులని కూడా ప్రకటించేస్తున్నారు…తాజాగా మచిలీపట్నంలో పేర్ని నాని నెక్స్ట్ పోటీ చేయరని, ఆయన తనయుడు కృష్ణమూర్తి పోటీ చేస్తారని చెప్పేశారు. అటు పెడనలో జోగి రమేశ్, పామర్రులో కైలా అనిల్ కుమార్ పోటీ చేసేస్తారని చెప్పేస్తున్నారు. తాజాగా గన్నవరం సీటు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీదే అని చెప్పేశారు. దీంతో గన్నవరంలో ఉన్న వైసీపీ సీనియర్ నేతలు దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకట్రావుకు షాక్ ఇచ్చారు. అంటే జగన్ నుంచి క్లారిటీ రావడంతోనే నాని సీట్లు ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది.