ఏడేళ్లుగా బానిస బ‌తుకు గుర్తుకురాలేదా ఈట‌ల‌.. గంగుల కౌంట‌ర్‌

ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాపై వ‌రుస‌గా టీఆర్ ఎస్ నేత‌లు స్పందిస్తున్నారు. ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఉద‌యం ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి మాట్లాడ‌గా.. ఇప్పుడు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఈట‌ల‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఈట‌ల రాజేంద‌ర్ ఆత్మ‌గౌర‌వ బావుటా ఎగ‌రేస్తా అంటున్నాడ‌ని, మ‌రి ఏడేళ్లుగా ఆయ‌న‌కు ఈ బానిస బ‌తుకు గుర్తుకు రాలేదా అంటూ ప్ర‌శ్నించారు.

ఏడేళ్లుగా మంత్రి ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు ఎందుకు స్పందించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. కేబినెట్ మీటింగుల్లో పాల్గొన్న ఈట‌ల ఒక్క‌సారిగా కూడా వీటిపై ఎందుకు మాట్లాడ‌లేదవి విమ‌ర్శించారు. ఇప్పుడు ప‌ద‌వి పోగానే ఆత్మగౌరవం గుర్తొచ్చిందా? అని మండిప‌డ్డారు.

ఆయ‌న ఎన్న‌డూ బీసీల గురించి నోరు మెద‌ప‌లేద‌ని, త‌న ఆస్తుల‌ను ర‌క్షించుకోవ‌డానికే రాజేందర్ ఢిల్లీకి వెళ్లి ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టారంటూ ఆరోపించారు. కారుకు ఓన‌ర్ అన్న ఈటల.. ఇప్పుడు బీజేపీకి క్లీన‌ర్ ప‌ద‌విని చేప‌ట్టాడా అంటూ నిల‌దీశారు. ఈట‌ల ఆధీనంలో ఉన్న పేదల భూములను బాధితులకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఇప్పించాల‌ని లేదంటే బీజేపీ ఈటల అవినీతికి మద్దతు తెలిపిన‌ట్టు అవుతుంద‌ని వ్యాఖ్యానించారు.