మొన్నటివరకూ దేవుడు.. ఇప్పుడు దెయ్యమయ్యాడా?

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన స్పష్టత ఇచ్చారు. దీంతో ఈటలపై మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ఇన్నాళ్లు దేవుడైన కేసీఆర్ అక్రమాలపై చర్యలు తీసుకోగానే దెయ్యం ఎలా అయ్యాడని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలపై ఏనాడూ మాట్లాడని ఈటలకు వారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఆస్తుల రక్షణ కోసం తాపత్రయం తప్ప ఆత్మగౌరవం లేనే లేదని వ్యాఖ్యనించారు. కారుకు ఓనర్లమన్న వ్యక్తి ఢిల్లీలో క్లీనర్‌గా పతనమయ్యాడని ఎద్దేవాన చేశారు. బీజేపీ పార్టీకి సిద్ధాంతాలు ఉంటే దేవరయాంజల్ దేవుడి భూములు, అసైన్డ్ భూములు వెనక్కిచ్చాకే బీజేపీలో చేర్చుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు, బీసీ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ నల్ల చట్టాల రద్దుపై బీజేపీ నుంచి ఎలాంటి హామీ వచ్చిందన్నారు. జేపీ నడ్డా నుంచి ఎలాంటి హామీలు పొందాడో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు, ఎస్సీలు అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని వ్యక్తిత్వం ఈటలదని చెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో ఈటల చాలా పదవులు అనుభవించాడని, ఏనాడు ఖాళీగా లేడని తెలిపారు. ఐదేళ్ల క్రితం ఆత్మగౌరవం దెబ్బతింటే పదవులు పట్టుకొని ఎందుకు ఊగిసలాడారని ప్రశ్నించారు. కేసీఆర్ బొమ్మతోనే హుజురాబాద్‌లో గెలిచాడని మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు.