ఓటుకు నోటు కేసు..రేవంత్ రెడ్డి ని రౌండప్ చేయడానికేనా…

ఓటుకు నోటు కేసు….రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు. ఊహించని విధంగా 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి (revanth reddy) బేరసారాలు సారించారనేది ప్రధాన ఆరోపణ.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి /revanth reddy

ఇక ఇందులో పలువురు టీడీపీ నేతల పేర్లు కూడా బయటకొచ్చాయి. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబుకు సంబంధించి ఆడియో టేపులు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఓటుకు నోటు కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి విచారణ మళ్ళీ మొదలైంది.

తాజాగా ఓటుకు నోటు కేసు విచారణ ఏసీబీ ప్రత్యేక కోర్టులో పునఃప్రారంభమైంది. స్టీఫెన్సన్‌ గన్‌మన్లు నీరజ్‌రావు, రఘునందన్‌ల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది. తాజాగా విచారణకు ఉదయసింహా, సెబాస్టియన్‌ హాజరయ్యారు. అలాగే రేవంత్‌రెడ్డి అప్పటి నలుగురు గన్‌మన్లను కోర్టు విచారించనుందని తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టే సమయంలోనే ఓటుకు నోటు కేసు పునఃప్రారంభం కావడంపై కాంగ్రెస్ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. చట్టం పరిధిలో ఉండే ఈ కేసు విషయంలో రేవంత్‌కు మళ్ళీ ఇబ్బంది ఏమన్నా జరుగుతుందా? అని డౌట్ పడుతున్నారు.

కానీ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ పగ్గాలు చేపట్టాక తెలంగాణ రాజకీయాల్లో మరింత దూకుడుగా ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీని అసంతృప్తి నేతలనీ బుజ్జగించారు. అటు అధికార టీఆర్ఎస్ టార్గెట్‌గా రాజకీయాలు వేడెక్కించారు. బీజేపీని సైతం రేవంత్ టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఓటుకు నోటు కేసు విచారణ మొదలుకావడంతో తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.