వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరో సారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్‌తో వైసీపీని ముడిపెట్టి వరుస ట్వీట్లు చేశారు. “ఒక్క కంపెనీని తీసుకొచ్చే సమర్థత లేదు, యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగం ఇవ్వడం చేతకాదు కానీ విశాఖలో లక్షణంగా ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్న 18 వేల మంది ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు మీకెవరిచ్చారు?” అంటూ మండిపడ్డారు. సొంతంగా ఒక్క భవనం కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా? అంటూ నిలదీశారు.
“సింగపూర్ కన్సార్టియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఆసియా పేపర్ అండ్ పల్ప్, రిలయన్స్ అన్నీ ఈ 8 నెలల్లో క్యూ కట్టాయి. అమరావతిలో సచివాలయం ఉండగా అది చాలదన్నట్టు విశాఖలో మిలీనియం టవర్ లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారంట. చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ను మించిపోయిందీ వైసీపీ వైరస్. ఈ ఎనిమిది నెలల్లోనే ఏపీని చెల్లాచెదురు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంటేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారు. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు పోతున్నాయి” అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.