ఏపీలో మళ్ళీ పవర్‌లోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది.ఏపీలో తిరుగులేని మెజారిటీ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు తెలంగాణలో పార్టీకి జవసత్వాలు సమకూర్చేందుకు సిద్ధమవుతున్నారు.తెలంగాణ రాష్ర్ట్లంలో బిఆర్ఎస్ పార్టీ బలహీనపడుతున్న వేళ రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని టీడీపీ చూస్తోంది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్లపాటు కెసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అధికారాన్ని అనుభవించింది. తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చింది తామేనంటూ పదేళ్ళపాటు పవర్‌లో కొనాగింది బిఆర్ఎస్. కానీ 2023 ఎన్నికల్లో ఓటమితో ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది ఆ పార్టీ. కాంగ్రెస్‌లోకి వలసలు పెరగడంతో పాటు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది బిఆర్ఎస్. ఇప్పుడు కెటిఆర్ కూడా జైలుకి వెళతాడు అనే టాక్ నడుస్తోంది. అటు బిజెపి వైపు నుంచి ఎలాంటి చలనం లేకపోవడంతో తెలంగాణలో ఎదిగేందుకు ఇదే సరైన సమయం అంటోంది టీడీపీ.
తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి మధ్య గట్టి పోరాటం నడుస్తోంది. ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ బలహీనపడుతోంది. రాష్ర్ట రాజకీయాల్లో బబీఆర్ఎస్ పాత్ర పోషించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. రాష్ర్ట విభజన జరిగాక వచ్చిన ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిచింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుంది. అయితే కెసిఆర్ పాలనాపరంగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు టిడిపి నేతలను తన వైపు తిప్పుకున్నారు.
దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టిడిపి నేతలు టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు. కొందరికి కేబినెట్ పదవులు కల్పించారు. కేసీఆర్ మంత్రివర్గంలో 90 శాతం మంది టిడిపి నాయకులే ఉండేవారు.అయితే ఇప్పుడు కెసిఆర్ పార్టీ ఉనికి చాటుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు పెరిగాయి. అయితే పూర్వ తెలుగుదేశం నాయకులు ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ వైపు అయిష్టంగా వెళ్తున్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేసేవిధంగా చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని మెజారిటీతో టీడీపీ ప్రభుత్వాన్ని నడుపుతోంది. జాతీయస్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు చంద్రబాబునాయుడు. ఇటువంటి సమయంలో తెలంగాణపై దృష్టిపెడితే అటు బీజేపీ నేతలు సైతం టీడీపీ వైపు చూసే పరిస్థితి వస్తెందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే దూకుడుగా ఉంది.బిఆర్ఎస్‌ను ఖాళీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు రేవంత్‌రెడ్డి.
ఇదే టైమ్‌లో చంద్రబాబు యాక్టివ్ అయితే కాంగ్రెస్‌లోకి వెళ్ళాలి అనుకునే వారు టీడీపీలోకి జంప్ కావడం తథ్యం. అలా పట్టుపెంచుకుని తెలంగాణలో మళ్ళీ పూర్వవైభవం చాటాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.ఏపీలో పొత్తు మాదిరిగానే బీజేపీతో సైతం కలిసి వెళ్ళేందుకు కూడా సిద్ధపడుతున్నారు. దీంతో బీజేపీలో కూడా కాస్త చలనం వచ్చే అవకాశం ఉంది. అటు బీజేపీ నేతలు కూడా చంద్రబాబు తెలంగాణలో బలపడాలని చూస్తున్నారు. అలా అయితే తాము కూడా కాస్త యాక్టివ్ కావచ్చన్నది వారి ఆలోచన. ప్రస్తుతం టీబీజేపీలో నేతల మధ్య దూరం పెరిగిపోయింది. ఇది కూడా టీడీపీకి కలిసివస్తుందని చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నారు.