చంద్రబాబు – పవన్… చేతులెత్తి చూపాల్సిన సమయమిది!

-

సాధారణంగా క్రికెట్ ఆటలో బ్యాట్స్ మెన్ 50, 100 పరుగులు చేసినప్పుడు హాఫ్ సెంచరీ, సెంచరీలుగా గుర్తించి బ్యాట్ ఎత్తి ప్రేక్షకులవైపు చూపిస్తారు… తాము సాధించామని గర్వంగా ప్రదర్శిస్తారు! అది క్రికెట్ కాబట్టి బ్యాట్ ఎత్తుతారు కానీ.. మరి రాజకీయాల్లో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా, కష్ట సమయంలో ప్రజలకు కానరాకుండా కనుమరుగయ్యి కూడా 50 రోజులు దాటితే అప్పుడు ఏమీ ఎత్తాలి… ఇంకేముంది చేతులు ఎత్తినట్లే అనుకోవాలి!! ప్రస్తుతం చంద్రబాబు – పవన్ కల్యాణ్ లపై సోషల్ మీడియా వేదికగా పేలుతున్న జోకులు ఇవి!

అవును… ఈ విషయంలో చంద్రబాబు – పవన్ కల్యాణ్ లు రికార్డులు తమ తమ ఖాతాల్లో వేసుకున్నట్లే చెప్పాలి! 40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు… రాష్ట్రానికి దూరంగా, రాష్ట్ర ప్రజలకు అందనంత దూరంగా ఉండి ఏభై రోజులు పూర్తిచేసుకోవడం అనే విషయం మామూలుది కాదు! వాయిదాల పద్దతిలో పూర్తిగా రాజకీయాలను వదిలేద్దాం అనుకునే నాయకులు మాత్రమే ఈ ఆలోచన చేయగలరు అనే కామెంట్లు వినిపిస్తోన్న తరుణంలో… పవన్ లాంటి యువ నేతలకు కూడా ఇది చేదు అనుభవమే!

ఈ సందర్భంగా కరోనా సమయంలో కూడా ప్రజల బాధ్యత పూర్తిగా ప్రభుత్వానికి వదిలేసిన రాజకీయ సంఘటన ప్రపంచ చరిత్రలో ఇదే ప్రథమం కాబోలు! ఇది వారి అసమర్ధత అనుకోవాలా లేక ప్రభుత్వ సమర్ధతపై వారికున్న నమ్మకం అనుకోవాలో చెప్పలేని సందిగ్ధ పరిస్థితి ఇప్పుడు వారిద్దరిది! కరోనా సమయంలో అంటే పోనీ ఏదో సాకుచెప్పో, ఆరోగ్యం విషయంలో భయపడో రాలేదు అనుకుందామంటే… విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన విషయంలో 12 మంది మరణించినా కూడా బాబు – పవన్ లు ఇల్లు కదల్లేదు! వీరి కరోనా భయానికి జాలిపడాలా.. స్టే హోం నిబంధనకు కట్టుబడినందుకు అభినందించాలా.. విష వాయువుకు ప్రజలు పిట్టల్లా రాలిపోయినా ఇంటి నుంచి కాలు బయటకు కదపని వీరి మనసుకు వెయ్యి నమస్కారాలు పెట్టాలా.. లేక, వీరు రాజకీయ నాయకులు అయినందుకు ప్రజలు వారిని వారే దూషించుకోవాలా… అనేస్థాయిలో కామెంట్లు వీరిద్దరిపై పడిపోతున్నాయంటే… ఈ వ్యవహారాన్ని ప్రజలు ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.

చంద్రబాబు కు పెద్ద వయసు వచ్చేసింది కాబట్టి విశాఖకు వెళ్లలేకపోయారు అనుకుందామంటే… అంతకంటే పెద్ద వయసున్న కమ్యునిస్టు నారాయణ హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లి వచ్చేశారు! బాబు వెళ్లలేకపోయినా పోని లోకేష్ ను అయినా పంపారా అంటే… చినబాబు, బుల్లి బాబుతో బిజీ అయిపాయే! ముఖ్యమంత్రికి, మంత్రులకు, మిగిలిన కొందరు నాయకులకు వీలైంది, కమ్యునిస్టులకు కుదిరింది… పవన్ కు మాత్రం విశాఖకు వెళ్లడానికి ఎందుకు వీలుకాలేదు? దీన్ని వీరి వీరి పరిపూర్ణ బాధ్యతా రాహిత్యం అనక మరేమంటారు? దీన్ని… రాజకీయంగా చేతులు ఎత్తేయటం కాక మరేమంటారు? రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఇతర రంగాల వారు ట్విట్టర్ లో స్పందించినట్లుగా… రాజకీయ నాయకులుగా వీరు కూడా ట్విట్టర్ లకు పరిమితమైపోతే… రిటైర్ మెంట్ ప్రకటించడమే బెటరేమో!!

Read more RELATED
Recommended to you

Latest news