ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో ఇప్పుడు రాజ్యసభ సీట్ల రచ్చ మొదలయింది. ఈ నెల ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్ధులను ఖరారు చేసారు. ముందు నుంచి అనుకున్న విధంగానే… అయోధ్య రామిరెడ్డి, మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పేర్లను జగన్ ఖరారు చేసారు. అలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబాని సూచించిన పరిమల్ నత్వానికి రాజ్యసభ సీటుని ఖరారు చేసారు.
ఈ నాలుగు స్థానాలు… అధికార పార్టీ ఏకగ్రీవంగా దక్కించుకోవడం దాదాపుగా ఖరారు అయింది. తెలుగుదేశం పార్టీకి బలం లేకపోవడంతో రాజ్యసభ సీట్ల విషయంలో ఆ పార్టీ పేరు వినపడటం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మంత్రులకే రాజ్యసభ సీట్లు ఇవ్వడంపై కొందరు నేతల్లో అసహనం ఉందని అంటున్నారు. వాస్తవానికి రాజ్యసభ సీట్ల విషయంలో చాలా మంది ఆశలుపెట్టుకున్నారు. ముఖ్యంగా రాయలసీమ నేతలు ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు.
అయినా సరే జగన్ మాత్రం ఈ స్థానాలను ఎమ్మెల్సీ పదవులు పోగొట్టుకున్న ఇద్దరు మంత్రులకు ఖరారు చేసారు. ఓడిపోయినా సరే ఎమ్మెల్సీలను చేసి మంత్రులను చేసారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళనే రాజ్యసభకు ఎంపిక చేసారు. మరి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ళు కష్టపడిన మా పరిస్థితి ఏంటీ అనేది నేతల ఆవేదన. ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన కొందరు కీలక నేతలు మాజీ మంత్రులు విజయసాయి వద్దకు వెళ్లినట్టు సమాచారం.
ఏకపక్షంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇది ఎంత వరకు సరైన విధానం కాదని పలువురు నేతలు విజయసాయి ముందు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అసెంబ్లీ కి పార్లమెంట్ కి సీట్లు ఇవ్వనప్పుడు తాము సైలెంట్ గా ఉన్నామని ఇప్పుడు కూడా తమకు ఈ విధంగా అన్యాయం చేసారని, ఎలాగూ మండలి రద్దు అయింది కాబట్టి, అక్కడ కూడా పదవులు వచ్చే అవకాశం లేదు. దీనితో కొందరు రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు.