ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్, ఇప్పటికే ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. రాబోయే ఖరీఫ్ నాటికి 11,158 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేస్తామని ఆయన సభలో హామీ ఇచ్చారు.
ఈ కేంద్రాల్లోనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఇస్తామని జగన్ స్పష్ట౦ చేసారు. పంట వేయడానికి ముందే కనీస మద్దతు ధరలు ప్రకటించామని చెప్పిన ఆయన ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసారు. కొత్తగా పశువులకు కూడా హెల్త్ కార్డు, పంట బీమా కార్డులు ఇస్తామని ఆయన ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాల్లోనే రైతుల సమస్య పరిష్కారిస్తామని ఈ సందర్భంగా జగన్ స్పష్ట౦ చేసారు.
అదే విధంగా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పిన ఆయన, ప్రభుత్వ స్టాంప్‌తో నాణ్యతతో కూడిన విత్తనాలు అందిస్తామని, రైతుల సమస్యలు అవే గ్రామాల్లో పరిష్కరించేవే రైతు భరోసా కేంద్రాలు అని పేర్కొన్నారు. గ్రామీణ, ఆర్థిక ప్రగతికి రైతు భరోసా కేంద్రాలు కీలకంగా మారతాయన్నారు ముఖ్యమంత్రి. రైతు భరోసా కేంద్రాల్లో విత్తన పరీక్షలు కూడా చేసుకోవచ్చని, వ్యవసాయంలో నూతన విధానాలను అందించేందుకు వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు.