ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. వైసీపీ ప్రభుత్వం దళితుల పక్షపాతి అని మరోసారి నిరూపించారు.విజయవాడ నడి బొడ్డున ఎన్నికల వేళ కొత్త చరిత్ర ప్రారంభించారు.బెజవాడ స్వరాజ్య మైదానంలో భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. చరిత్రలో నిలిచిపోయేలా సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితమిచ్చే కార్యక్రమం విజయవంతం గా పూర్తయింది.2021 డిసెంబర్ 21న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసారు.
స్మృతివనం పనులను మహాయజ్ఞంలా పూర్తిచేశారు. అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రాంగణం ఇకపై ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే వేదికగా మారనుంది. దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది. 125 అడుగుల విగ్రహం, 81 అడుగుల బేస్ తో మొత్తం 206 అడుగుల విగ్రహం ఆవిష్కరణ పండుగ వాతావరణంలో జరిగింది.
స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు దీని విగ్రహం ఏర్పాటుకు రూ.404.35 కోట్లు ఖర్చయింది. ఇందులో అందమైన గార్డెన్‌ను రూపొందించారు. ఎంఎస్ అసోసియేట్ సంస్థ డిజైన్లు రూపొందించింది. అంబేడ్కర్ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్‌నే ఉపయోగించారు. ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి మైదానం, వాకింగ్ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో.. 539 పిల్లర్లతో నిర్మించారు. ముందుభాగం కారిడార్‌ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు.
రాష్ట్రానికే తల మానికంగా ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌వర్క్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు హాల్స్ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు. రెండో హాల్లో మ్యూజియం, మరో హాల్‌లో లైబ్రరీ ఏర్పాటు చేసారు. అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియంను 75 మంది సీటింగ్ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం కూడా సిద్ధమైంది.
ఈ స్మృతివనాన్ని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం.., అణగారిన వర్గాలకు నిరంతరం.., ధైర్యాన్ని, అండని ప్రసాదించే ఓ మహా స్ఫూర్తిగా వుంటుందని కొనియాడారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి భావాలు కుల మతాలకు అతీతమైనవని కాబట్టే, ఆయన్ను ఇంతగా గౌరవించుకుంటున్నామన్నారు. ఇప్పుడు తాజాగా ఆవిష్కరించిన ఈ మహా శిల్పం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటం మాత్రమే కాకుండా, చరిత్రను తిరగరాసేలా, వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తినిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.