పెళ్లి పీట‌లెక్కుతోన్న ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు..

-

ఇది నిజంగానే ఆస‌క్తిక‌ర‌మైన అంశం. సినిమా ల‌వ్ స్టోరీకి ఎంత‌మాత్రం తీసిపోని….మాంచి పొలిటిక‌ల్ ప‌ర్స‌న్స్ ల‌వ్‌స్టోరీ.. సాధార‌ణంగా డాక్టర్లు డాక్టర్లను, లాయర్లు లాయర్లను, కలెక్టర్లు కలెక్టర్లను, యాక్టర్లు యాక్టర్లను వివాహం చేసుకోవడం మ‌నం ఇప్పటివరకు చూశాం. కానీ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేని వివాహం చేసుకోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. అందులోనూ వారు ఒకే పార్టీకి చెందిన నేత‌లు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎన్నిక‌య్యారు. ఇక అస‌లు విష‌యంలోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అదితి సింగ్‌తో పంజాబ్‌లోని షహీద్‌ భగత్‌సింగ్‌ నగర్‌ ఎమ్మెల్యే అంగద్‌ సింగ్‌ షైని ఈనెల నవంబర్‌ 21న వివాహంతో జంట‌గా మార‌బోతున్నారు.

గ‌త సంవ‌త్స‌ర కాలంగా వీరి వివాహం గురించి మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. మొత్తానికి ఎట్ట‌కేల‌కు ఇద్ద‌రు ఎమ్మెల్యేలు భార్య‌భ‌ర్త‌లుగా మారే సుముహూర్తం రానే వ‌చ్చింది. ఇది పెద్ద‌లు కుదిర్చిన ప్రేమ వివాహ‌మ‌ని ఎమ్మెల్యేలిద్ద‌రూ మీడియాకు తెలిపారు. ఇప్ప‌టికే కార్డుల‌ను అతిథుల‌కు అంద‌జేసిన‌ట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ ప్రముఖ రాజకీయ కుటుంబాలకు చెందిన వారు కాగా, ఒకే ఏడాది ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం మ‌రోవిశేషం. పంజాబ్‌ అసెంబ్లీలో అంగద్‌ సింగ్‌ షైనీ మిగతా ఎమ్మెల్యేల కంటే వయసులో చిన్నవాడు. అలాగే అదితి సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో వయసులో చిన్న ఎమ్మెల్యే.

అంగద్‌ కంటే అదితి వయసులో నాలుగేళ్లు పెద్ద. వీరి వివాహ రిసెప్షన్‌ నవంబర్‌ 23న నిర్వహించనున్నారు. కాగా, అదితి సింగ్‌ 90వేల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. అదితి తండ్రి అఖిలేష్‌ కుమార్‌ సింగ్‌ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవగా, అంగద్‌ సింగ్‌ షైనీ తండ్రి దిల్‌బాగ్‌ సింగ్‌ నవాన్‌షహర్‌ అసెంబ్లీ స్థానం నుంచి రికార్డు స్థాయిలో ఆరు సార్లు ఎన్నికయ్యారు. ఇక వీరి వివాహంతో రెండు రాష్ట్రాల్లోనూ సంబ‌రాలు నెల‌కొన్నాయి. వారి సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే పార్టీ అభిమానుల సంతోషానికి అవ‌ధుల్లేవ‌ని చెప్పాలి. వారి జీవితం క‌మనీయం కావాల‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, వారివారి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తున్నార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news