దగ్గుబాటి ఫ్యామిలీ టీడీపీలోకి వస్తామంటే ఆపుతుంది ఎవరు…?

దగ్గుబాటి ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తు ఏంటి…? ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఒకప్పుడు ఎంతగానో అభిమానించిన వారిని వేధిస్తున్న ప్రశ్న ఇది. పురందరేశ్వరి బిజెపిలో ఉన్నారు. వెంకటేశ్వరరావు వైసీపీలో ఉన్నారు… ఇటీవల వెంకటేశ్వరరావుకి జగన్ భార్యా భర్తలు ఇద్దరు ఒకే పార్టీలో ఉండాలని స్పష్టంగా చెప్పారు. దానికి దగ్గుబాటి సుముఖత వ్యక్తం చేయడంతో, సీటు రాలేదని పార్టీ మారిన రావి రామనాదం బాబుని మళ్ళీ పార్టీలోకి తిరిగి తీసుకొచ్చి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో కనీసం దగ్గుబాటిని ఒక మాట కూడా అడగలేదట…

ఇక ఆయన భార్య బిజెపిని వీడటానికి సిద్దంగా లేరనే విషయం కూడా జగన్ కు అర్ధం కావడంతో… మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా… ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పారట. దీనితో దగ్గుబాటి కుటుంబం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల దామచర్ల జనార్ధన్ ని కలిసి తాను పార్టీలోకి వస్తానని దగ్గుబాటి చెప్పారట. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు ఆయన తీసుకువెళ్ళగా… చంద్రబాబు ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల వద్ద ప్రస్తావించారని సమాచారం.

 

దీనికి చంద్రబాబు సతీమణి… భువనేశ్వరి పార్టీలోకి తీసుకోవద్దని, గతాన్ని మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదని అన్నారట. ఇక కోడలు బ్రాహ్మణి నుంచి వద్దనే సంకేతాలు చంద్రబాబుకి వెళ్లినట్టు సమాచారం. బాలకృష్ణ వద్ద కూడా చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించగా అభిప్రాయాన్ని చంద్రబాబుకే వదిలేసారని అంటున్నారు. ఇటు కార్యకర్తలు కూడా వారి విషయంలో అసహనంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి… వాళ్లకు ఒక పార్టీ అంటూ ఉండదని… ఎన్నికకు ఒక పార్టీలోకి వెళ్తారని… ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇటు రావాలని చూస్తున్నారనే ఆగ్రహంలో కార్యకర్తలు కూడా ఉన్నారట. మరి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.