రేవంత్ అదే అంశాన్ని అవకాశంగా మలుచుకుంటాడా?

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ ప్రెసిడెంట్ గా ప్రకటించిన తరువాత పరిణామాలు టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడడం లేదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న టీఆర్ఎస్ కు రేవంత్ ఎంపికతో కొత్త చిక్కొచ్చి పడినట్లయింది. కృష్ణా జలాల వివాదాన్ని చాకచక్యంగా టీఆర్ఎస్ ముందుకు తీసుకువచ్చింది. దీనిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా చూపి… హుజురాబాద్ ప్రజలు ఎవరూ బీజేపీ వైపు తిరగకుండా ఉండేలా చేద్దామని ప్లాన్ చేసింది.

హుజురాబాద్/ revanth reddy

 

కానీ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో టీఆర్ఎస్ అనుకున్నవన్నీ అమలయ్యేలా ప్రస్తుతం కనిపించడం లేదు. దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన కొడంగల్ నేత, ప్రస్తుత మల్కాజ్ గిరి ఎంపీ ని కాంగ్రెస్ టీపీసీసీ కెప్టెన్ గా నియమించింది. కృష్ణా జలాల విషయంలో ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని కూడా దోషిగా చూపి.. కాంగ్రెస్ నాయకులు ఎటు మాట్లాడకుండా టీఆర్ఎస్ చేయగల్గింది. కానీ ప్రస్తుతం దక్షిణ తెలంగాణ కు చెందిన నేత అయిన రేవంత్ రెడ్డి అసలు దక్షిణ తెలంగాణ లో ఈ ఏడేళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టలేదని, అంతే కాకుండా కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదని, దానిపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలోని ప్రముఖ సాగు నీటి రంగ నిపుణులు కూడా ఈ టీపీసీసీ బాస్ కు సహకరించేందుకు ముందుకు వచ్చారని సమాచారం.

కృష్ణా జలాల విషయంలో అధికార టీఆర్ఎస్ ఒకటి తలిస్తే… మరోటి జరిగిందని పలువురు రాజకీయ నాయకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీగా నియమించడంతో ఒక్క సారిగా రాష్ర్ట రాజకీయాల రూపు రేఖలు మారనున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ వేసిన ఎత్తుగడ చివరికి టీఆర్ఎస్ కే తలనొప్పిగా మారనుందని విశ్లేషిస్తున్నారు.