మాటలు ఆగాయి…మూటలు మాట్లాడుతున్నాయి..!

-

హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం ముగిసింది….గత కొన్నిరోజులుగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికకు ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. ఇప్పటికే అన్నీ పార్టీలు తమ ప్రచారంతో జనాలని ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ఎన్ని రకాలుగా హుజూరాబాద్ ప్రజలని ఆకర్షించాలని ప్రయత్నించిందో చెప్పాల్సిన పని లేదు. ఇటు ఈటల రాజేందర్….కేవలం తన సొంత బలం, ఆత్మగౌరవం నినాదంతో ముందుకెళ్లారు. అటు కాంగ్రెస్ ఏమో కనీసం కొన్ని ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ అయినా తెచ్చుకోవాలనే దిశగా ముందుకెళ్లింది.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

ఏదైతే ఏముంది…హుజూరాబాద్ ఉపఎన్నికలో ఒక ఘట్టం ముగిసింది. ప్రచారం ముగిసింది…మైకులు మూగబోయాయి… నెల‌ల కింద‌ హుజూరాబాద్ వ‌చ్చిన స్థానికేత‌ర‌ నేత‌లంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో హుజూరాబాద్‌ సైలెంట్ అయిపోయింది. ఇక ఇప్పుడు అసలు ఘట్టానికి తెరలేచింది.. సైలెంట్‌గా రాజకీయం నడుస్తోంది. ఇప్పటికే ప్రలోభాల పర్వం మొదలైపోయింది. ఎవరికి వారు…ఓటర్లని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ విషయంలో ఒక ప్రధాన పార్టీ అడుగు ముందే ఉంది.. ఇప్పటికే ఓటుకు రూ.6 వేలు చొప్పున పంచుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. కొందరు డబ్బులు అందని వారు…బహిరంగంగానే బయటకొచ్చి.. ఆ పార్టీపై ఫైర్ అవుతున్నట్లు వీడియోలు కూడా వచ్చేస్తున్నాయి. ఒక పార్టీ ఒక్కో ఓటుకు రూ.6 వేలు ఇస్తే, మరో పార్టీ రూ.1500 ముట్టజెబుతోందని తెలుస్తోంది. అయితే వీలుని చూసి ఆ ఎమౌంట్‌ని ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అసలు రూ.6 వేలు ఇస్తున్న ఒక పార్టీ… నియోజకవర్గంలో 2,36,873 ఓట్లు ఉండగా ఆ పార్టీ లక్షా 50 వేల మంది ఓటర్లకు రూ.90 కోట్లను గంటల వ్యవధిలోనే పంచేసిందంట. అంటే ఆ పార్టీ ఎంత స్పీడుగా డబ్బులని వెదజల్లుతుందో అర్ధమవుతుంది. అయితే మరొక పార్టీ మొదట విడత రూ.1500 ఇచ్చి…చివరిగా రూ.3,500 ఇవ్వడానికి రెడీ అవుతుందట. అంటే మొత్తం రూ.5 వేలు ఇవ్వనుంది. మొత్తానికి హుజూరాబాద్‌లో మాటలు ఆగితే….మూటలు మాట్లాడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news