బాలినేని అభ్య‌ర్ధ‌న‌కు ఈసీ ఓకే.. ఒంగోలులో ఉత్కంఠ

-

ఈవిఎంల ప‌నిత‌నంపై కొన్ని నెల‌లుగా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌లువురు రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నేత‌లు, నిపుణులు ప‌లువిధాలుగా ఈ అంశంపై స్పందించారు. అంత‌ర్జాతీయంగా కూడా ఈ అంశం చ‌ర్చ‌కు దారితీసింది. ఈవీఎంల‌ను హ్యాక్ చేయ‌వ‌చ్చ‌ని కొంద‌రు క్లారిటీ ఇచ్చారు. అందుకే కొన్ని దేశాల్లో వాటిని బ‌హిష్క‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇదే క్ర‌మంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో పోలింగ్ సందర్భంగా ఉపయోగించిన ఈవీఎంల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. వాటిని నివృత్తి చేయాని కోరుతూ ఎన్నిక‌ల సంఘాన్ని ఆశ్ర‌యించారు. ఒంగోలు నియోజక వర్గంలో పోలింగ్ నాడు ఉపయోగించిన ఈవీఎంలను రీ వెరిఫికేషన్ చేయాలని ఆయ‌న కోరారు.

బాలినేని అభ్యర్థనకు ఈసీ ఓకే చెప్పింది. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరిన విధంగా ఈవీఎంల పునః పరిశీలన చేయనున్నారు. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి 12 పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బాలినేని అక్కడ ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తూ రీ వెరిఫికేషన్ చేయాలని 5, 66,400 రూపాయలు జూన్ 10వ తేదీన చెల్లించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు బెల్ ఇంజనీర్లతో డమ్మీ బ్యాలెట్లు ఏర్పాటు చేసి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోరిన విధంగా 12 పోలింగ్ బూత్‌ల‌లో రీ వెరిఫికేషన్ చేయించనున్నారు.

తనకు పూర్తిగా మెజారిటీ వస్తుందని భావించిన పోలింగ్ బూతులలో తక్కువ ఓట్లు రావడంతో బాలినేనికి అనుమానం వచ్చింది. ఇక ఈ రీ వెరిఫికేషన్ కోసం అచ్చం ఓటర్లతో ఓట్లు వేయించిన ప్రాసెస్ ను డమ్మీగా చేయిస్తారు. ఆ పోలింగ్ బూత్ లలో ఓటర్లతో రీ వెరిఫికేషన్ పోలింగ్ ఆయా పోలింగ్ బూత్ లో వాడిన ఈవీఎంలను వివి ప్యాట్లను తెప్పించి సాధారణ పోలింగ్ మాదిరిగానే ఓటర్ల చేత ఓట్లు వేయిస్తారు. అభ్య‌ర్ధుల స‌మ‌క్షంలోనే ఇలా చేస్తారు. ఓటు వేశాక అదే గుర్తుపైన నమోదవుతుందా లేదా వేరే పార్టీ గుర్తుపై నమోదవుతుందా అనేది అక్కడే పరిశీలిస్తారు.

ఇక ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. బెల్ కంపెనీకి చెందిన నిపుణుల సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుందని 19వ తేదీ నుంచి రోజుకు రెండు బూత్ లలో ఓటర్లతో ఓట్లు వేయించి రీ వెరిఫికేషన్ పోలింగ్ చేస్తారని చెబుతున్నారు. మొత్తం 12 బూత్ లలో రీ వెరిఫికేషన్ జరుగనుంది.దీంతో ఒంగోలు వ్యాప్తంగా ఉత్కంఠ కొన‌సాగుతోంది.

ఈ ప్ర‌క్రియ‌తో ఈవీఎంల‌పై ఉన్న అనుమానాలుఏ తొల‌గిపోతాయ‌ని ఈసీ అంటుండ‌గా హ్యాకింగ్ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంద‌ని వైసీపీ నేత‌లు చెప్తున్నారు. ఒక‌వేళ ఈవీఎంలు హ్యాకింగ్‌కు గుర‌య్యాయ‌ని తేలితే ఏపీలో ఎన్‌డిఏ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలే అవ‌కాశాలు ఉన్నాయి. ఈవిఎంల‌పై రాష్ర్ట‌మంత‌టా రీవెరిఫికేష‌న్ చేయాల‌నే డిమాండ్ పెరుగుతుంది. అదే జ‌రిగితే మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు రావొచ్చ‌నే అనుమానాలు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు విశ్లేష‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news