తెలంగాణలో ఇప్పుడు ఏదైనా ఇష్యూ గానీ రాజకీయం గానీ ఉందా అంటే అది హుజూరాబాద్ మాత్రమే. ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసినప్పటి నుంచి రాజకీయాలు హుజూరాబాద్‌కు చేరుకున్నాయి. అయితే ప్రతిపక్షాలు లేవు. అధికార పక్షమే రెండుగా చీలిపోయి రాజకీయాలు చేస్తోంది. మొన్నటి వరకు స్టేట్ లీడర్లను కలుస్తూ బిజీగా ఉన్నారు ఈటల రాజేందర్.
కానీ ఇప్పుడు హుజూరాబాద్‌పైనే ఫోకస్ పెట్టారు. తన వర్గీయులను మంత్రి గంగుల కమలాకర్ తనవైపు తిప్పుకోవడంతో అలర్ట్ అయ్యారు ఈటల. నియోజకవర్గంలోనే ఉంటూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని భావిస్తున్నారు.
ఇందుకోసమే గత మూడు రోజులుగా హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. గంగులను కలుస్తున్న నేతలు, కార్యకర్తలపై ఫోకస్ పెడుతున్నారు. వారిని మళ్లీ తనవైపు తిప్పుకునేందుక పావులు కదుపుతున్నారు. ఇందుకోసం తన రాజకీయ అనుభవాన్ని రంగరిస్తున్నారు. ప్రెస్మీట్లు పెడుతూ గంగులకు కౌంటర్ వేస్తున్నారు. హుజూరాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లో తన కేడర్ చేజారిపోకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.