అన్నీ చూస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం : ఈటల

భాజపాలో చేరేవారిని తెరాస నేతలు కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెరాసకు సహకరించటం సరికాదన్నారు.

భాజపాలో చేరే నేతలపై పీడీ యాక్టు పెట్టి జైల్లో వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా దారుణమన్నారు. వేల సంఖ్యలో ఎంపీటీసీలు, వందల సంఖ్యలో ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్‌లు, ఎమ్మెల్యేలు భాజపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

”భాజపాలో చేరే వారిని కేసులతో భయపెడుతున్నారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు పెట్టి వేధిస్తున్నారు. తెరాసలో ఉన్నన్ని రోజులు ఏ కేసులు పెట్టట్లేదు. భాజపాలో చేరేందుకు వేల సంఖ్యలో ఎంపీటీసీలు సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా భాజపాలో చేరుతారు. పోలీసు అధికారులు ఏకపక్షంగా తెరాసకు సహకరించటం సరికాదు. భవిష్యత్‌లో ప్రభుత్వం మారితే ఇబ్బంది పడేది పోలీసు అధికారులే. అన్నీ గుర్తుంచుకుని రేపు లెక్క అప్పజెప్తాం.” -ఈటల రాజేందర్‌, భాజపా ఎమ్మెల్యే

ఎన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేసినా భాజపాలో చేరే నాయకులను ఆపలేరని ధ్వజమెత్తారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు… తెరాసలో ఉన్నన్ని రోజులు ఎలాంటి కేసులు, వేధింపులు లేవని మండిపడ్డారు. చౌటుప్పల్‌ ఎంపీపీ భాజపాలో చేరగానే అర్ధరాత్రి ఇంటికి వెళ్లి పోలీసులు వేధిస్తున్నారని విమర్శించారు. కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆవేదన చెందారు. ”మీరు చేసిన తప్పులన్నీ లెక్కపెడుతున్నాం.. తప్పకుండా ఆ లెక్కలు తేలుస్తాం.” అని హెచ్చరించారు. కూలి పని చేసుకుని జీవనం సాగించే భాజపా కార్యకర్తలను కూడా వదలట్లేదని ఆరోపించారు. వివిధ రకాలుగా వారిని వేధింపులకు గురి చేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.