ఆ మాజీ మంత్రి కూడా గోడ దూకేందుకు సిద్దమయ్యారా

-

ఏపీలో ఒక పక్క పంచాయతీ ఎన్నికల సెగలు రేగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా మోహరిస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో పశ్చిమగోదావరిజిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఒక్కసారిగా సైలెంట్ అయ్యారట..కాంగ్రెస్,టీడీపీ పార్టీల్లో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లారట..ఎన్నికల వేళ తమ నేత ఎందుకిలా అంటూ తెలుగు తమ్ముళ్లు ఆరా తీస్తున్నారట.

టీడీపీ నేత పితాని సత్యనారాయణ సైలెన్స్‌ పార్టీ శ్రేణులకు అంతుచిక్కడం లేదట. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించేలా ఎదిగిన ఆయన.. ఇప్పుడు ఎందుకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని తెలుగు తమ్ముళ్లు ఆరా తీస్తున్నారట. పార్టీలో ప్రాధాన్యం లేదనా లేక.. అధినేత పట్టించుకోవడం లేదన్న వేదనో కానీ రాజకీయాలను లైట్ తీసుకున్నారట. ఇక ఆయన సైలెంట్ అవ్వడంతో ప్రత్యర్దివర్గం రంగంలోకి దిగి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం మొదలుపెట్టేసింది.

పితాని సత్యనారాయణ పార్టీ మారతారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. ఈఎస్ఐ స్కామ్‌ కేసు విచారణ స్పీడ్‌గా ఉన్న సమయంలో పితాని సత్యనారాయణ కుమారుడు పేరు కూడా బయటకు వచ్చింది. ఆ సమయంలో టీడీపీ నుంచి సపోర్ట్‌ లేదన్న ఆవేదన ఆయన వ్యక్తం చేశారట. అప్పుడే పార్టీ మారిపోతారని అంతా అనుకున్నారు. కానీ.. ఆ ప్రచారానికి ఫుల్‌ స్టాప్‌ పడింది. పితానిని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిని చేశారు చంద్రబాబు. పార్టీలో పెద్ద పదవి అయితే ఇచ్చారు కానీ.. ఆ మేరకు ప్రాధాన్యం లేదన్న భావనలో ఉన్నట్టు పితాని వర్గం చెబుతోంది.

ఇటీవల పితాని కుమారుడి పెళ్లి జరిగింది. ఆ వివాహానికి చంద్రబాబు రాలేదు. పిలిచినా పార్టీ అధినేత ఎందుకు రాలేదు అని అంతా చెవులు కొరుక్కున్నారు. పార్టీ పెద్దలు రాకపోవడంతో ఆయన సైతం అలకబూనారని చర్చ జరిగింది. ఆ విషయం తెలుసుకున్నారో ఏమో పితాని కుమారుడి పెళ్లి జరిగిన నెల రోజుల తర్వాత నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వెళ్లారు చంద్రబాబు. మాజీ మంత్రిని బుజ్జగించారని సమాచారం. అయినా పితాని సంతృప్తి చెందలేదట. పంచాయతీ ఎన్నికల హడావిడి ఉన్నా సైలెంట్‌గా ఉండటాన్ని పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు.

వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారని పితానిపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. ఒకవేళ ఆయన అధికార పార్టీ కండువా కప్పుకొంటే ఆచంట కాకుండా పాలకొల్లుకు పంపుతారని కొత్త ప్రచారం జోరందుకుంది. ఆచంటలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఉన్నారు. పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉన్నారు. పాలకొల్లులో వైసీపీ బలోపేతానికి అనేక మందికి పదవులు ఇచ్చినా.. ఆధిపత్యపోరుతో వారు రచ్చకెక్కుతున్నారు. దీంతో పితాని అయితే కరెక్ట్‌ అనే అభిప్రాయం వైసీపీలో ఉందట.

తనపై జరుగుతున్న ప్రచారంపై సైతం మౌనంగానే ఉంటున్నారు పితాని సత్యానారాయణ. ఎక్కడా స్పందన లేదు. ఆచంటలో మాత్రం టీడీపీ వర్గాలు కొత్త నేత అన్వేషణలో పడ్డాయట.

Read more RELATED
Recommended to you

Latest news