తెలుగుదేశం పార్టీలో జేసీ ప్రభాకర్ రెడ్డి రాజేసిన రచ్చ ప్రస్తుతం ఆ పార్టీలోనే కాదు.. రాజకీయవర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. పార్టీలోనే ఉంటూ.. సొంతపార్టీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్లు సహేతుకమైనవి కావంటూ.. టీడీపీ నేతలు ఒక్కసారిగా జేసీపీ పై ఫైరయ్యారు. విచిత్రం ఏమిటంటే… ఇప్పటివరకూ బాబు ఈ విషయాలపై ప్రస్థావించిన దాఖలాలు లేవు! ఆ సంగతి అలా ఉంచితే… “జేసీ ఆర్మీ” పేరుతో నడుస్తున్న ఫేస్ బుక్ పేజీ ప్రస్తుతం టీడీపీ సీమ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుందంట!
అవును… “జేసీ ఆర్మీ” అనే ఫేస్ బుక్ పేజీల్లో.. టీడీపీ నేతలే లక్ష్యంగా పోస్టులు ఉంటున్నాయి. టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారని చెప్పడంతోపాటు.. మరి కొంతమంది టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలు కూడా ఆ పేజీల్లో పోస్టు చేస్తున్నారు. అందులో భాగంగా… మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి 250 ఎకరాల భూములున్నాయని.. వాటిని కాపాడుకోవడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారంటూ కూడా ఆ పోస్టుల్లో ఆరోపించారు!
దీంతో… టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి డబ్బులిచ్చి కొంతమందితో తమపై వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తున్నారంతూ ఫైరవుతున్నారు. ప్రభాకర్ రెడ్డి పెయిడ్ ఫేస్ బుక్ పేజీలకు ధీటుగా తాము కూడా స్పందించగలమని.. కాసుకోమని సవాళ్లు విసురుతున్నారు.
ఆ సంగతులు అలా ఉంచితే… ఇప్పటికే “వెంటిలేటర్ పై ఉన్న టీడీపీకి మళ్లీ ఇంటర్నల్ వార్ ఒకటా” అనే కామెంట్లు పెడుతున్నారు కార్యకర్తలు! పార్టీ వెంటిలేటర్ పై నుంచి కనీసం వార్డుకైనా వస్తుందా, లేక అటునుంచి అటు మార్చురీకేనా? అనే సందేహాలు కలుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ ఇంటర్నల్ వార్ పై కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే… ఈ విషయాలు ఇంకా బాబు & చినబాబు దృష్టికి వెళ్లినట్లులేదు! నిజంగానే వారికి తెలియలేదా.. తెలిసినా మిన్నకున్నారా?