సుమారు రెండున్నరేళ్లుగా బాబు చూస్తున్న ఎదురుచూపులకు ఫలితం వచ్చింది! ఏపీలో కరోనా కాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలుచేస్తూ పాలిస్తున్నారనే పేరు సంపాదించుకున్న జగన్ పాలనలో బాబుకు తప్పు దొరికింది! ఇప్పుడు ఆ తప్పే చంద్రబాబుకు వరం కాబోతుంది.. బలమైన వాదన వినిపించే అవకాశాన్ని ఇచ్చింది.
అవును… ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతం ఏపీకి అప్పులు పెరిగిపోయాయి. ఇప్పుడిదే అంశం బాబుకు ప్రధాన అస్త్రంగా మారబోతోంది. నవరత్నాల పేరుతో అడిగినవారికి, అడగని వారికి.. అందరికీ ఆర్థిక సాయం చేస్తూ వస్తున్న జగన్… ఆ సంక్షేమ పథకాల అమలులోనే తనకు దొరికిపోతారని బాబు భావించారు. కానీ కరోనా కాలంలో కూడా బాబుకు జగన్ ఆ అవకాశం ఇవ్వలేదు.
అయితే… కరోనా ఎఫెక్ట్ వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి మాత్రం బాబుకు జగన్ దొరికిపోయారు. ఇది వాస్తవమే అయినా… అలా అని అప్పుడే బాబు & కో ఫిక్సవ్వకూడదు అనేది విశ్లేషకుల మాటగా ఉంది. ప్రస్తుతానికి అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాబ్లం! ఎందుకంటే… ఇప్పటికిప్పుడు ఏపీ అప్పులు భారీగానే ఉండొచ్చు. కానీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది కాబట్టి… భవిష్యత్తులో ఆదాయం పెరిగితే జగన్ ఈ సమస్యను కూడా సమర్థంగా ఎదుర్కునే అవకాశం ఉంది.
ఇదే సమయంలో జగన్ అభివృద్ధిపై కూడా చాలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఏపీలో సంక్షేమం అయినా – జగన్ భావిస్తోన్న నాడు – నేడు వంటి అభివృద్ధి అయినా… పూర్తి ఫలితం జగన్ కు అందడం లేదనే వాదనా ఉంది. ఎందుకంటే… అనర్హులకు కూడా జగన్ సంక్షేమ ఫలాలు ఇస్తున్నారని.. ఫలితంగా వృధా ఖర్చు చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక రకంగా ఇది కూడా గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న బలమైన వాదనే!
ఇదే సమయంలో… గ్రామంలో ప్రభుత్వ బడికి కార్పొరేట్ హంగులు అద్దారు జగన్. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ఇది ఆల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ పథకంగానే మిగిలింది. అయితే… ఆ పాఠశాలలకు వెళ్లే రోడ్డు మాత్రం గుంతలతో బురదలతో నిండిపోయి ఉంటుంది. వాటిపై కూడ జగన్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాకానిపక్షంలో… తన కష్టంలో, తన పాలనలో జగన్ చేస్తున్న పనికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫలితాలు మాత్రమే లభించే సమస్య ఉంది. సంక్షేమం మాటున అభివృద్ధి కుంటిపడితే.. అది జగన్ కు అతిపెద్ద ప్రమాదంగా మిగిలే అవకాశం ఉంది! సో… జగన్ ఈ రెండున్నరేళ్లలో రాష్ట్ర అప్పుల్ని కవర్ చేసేందుకు ప్రయత్నించాలి.. అభివృద్ధిని చూపించే పనికి పూనుకోవాలి.. అదే జరిగితే బాబుకు చావుదెబ్బే అని గ్రహించాలి!