ఏపీలో నామినేట్ పదవుల సందడి… తొలి ప్రాధాన్యత వాళ్లకేనా…

-

జులై నెలాఖరులోగా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తారని ఏపీలో టాక్‌ నడుస్తోంది.దీంతో అమరావతి పరిసర ప్రాంతాలు ఆశవహులతో సందడి వాతావరణం కనిపిస్తోంది. దాదాపు వందకు పైగా కార్పొరేషన్లతో పాటు టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ప్రధాన ఆలయాలకు చైర్మన్‌లను కూడా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఐతే ప్రస్తుతం తొలి విడతగా ముఖ్యమైన ఆలయాలతో పాటు 25 ప్రధాన కార్పొరేషన్ చైర్మన్‌ పదవులను భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో సీఎం చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి విధేయులుగా పని చేసిన వారిని గుర్తించడం ముఖ్యమన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారట. అందుకే నామినేటెడ్‌ పదవుల పందేరం చంద్రబాబుకి కత్తి మీద సాములా మారిందట.

ఈ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయడం వలన 31 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలను టీడీపీ కోల్పోయింది. అక్కడ మిత్రపక్షాలకు సహకరించాల్సి రావడంతో సంబంధిత ఇంచార్జ్ లు పోటీ నుంచి తప్పుకోవలసి వచ్చింది. అలా పోటీ నుంచి తప్పుకుని మిత్రపక్షం గెలుపునకు సహకరించిన నేతలకు నామినేట్ పదవుల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అదేవిధంగా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలకు కూడా ప్రాధాన్యం ఇచ్చేలా జాబితా సిద్ధం చేస్తున్నారు. జులై నెలాఖరుకి భర్తీ చేయనున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులకు లిస్టు రెడీ అవుతోందని టీడీపీ వర్గాల సమాచారం. ఐతే ఇందులో ఎవరిరెవరి పేరు ఉంటుందనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో కొనసాగుతోంది.

మొన్నటి ఎన్నికల్లో అధినేత హామీతో పోటీ నుంచి తప్పుకుని ఇప్పుడు పదవి ఆశిస్తున్న సీనియర్లు చాలామంది ఉన్నారు. దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, గుంటూరు నగరానికి చెందిన కోవెలమూడి రవీంద్ర, బుద్ధా వెంకన్న, విశాఖ నగరానికి చెందిన గండి బాబ్జీ, కాకినాడ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు ఉన్నారు.అయితే వీరిలో కొందరికి ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చారు. ఐతే ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి జనసేనకు కేటాయించగా, ఇంకొకటి కొత్తగా పార్టీలోకి వచ్చిన సి రామచంద్రయ్యకు కేటాయించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఇక్బాల్‌తోపాటు గురజాల నియోజకవర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి వంటి వారు లైన్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news