రామ జన్మభూమిలో ఆగస్టు 5న నిర్వహించబోతున్న రామాలయ శంకుస్థాపన వేడుకకు పలువురు కార్పొరేట్ దిగ్గజాలను ఆహ్వానిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ, అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ వంటివారు 200 మంది ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. కళలు, సంస్కృతి, పరిశ్రమల విభాగం నుంచి పలువురిని ఆహ్వానిస్తున్నారు.
రామ మందిరం నిర్మాణంలోనే కాకుండా అయోధ్య నగరంలో సదుపాయాల కల్పనలో కార్పొరేట్ సంస్థలు పెద్దఎత్తున పాలు పంచుకోనున్నాయని ఆహ్వానితుల జాబితా చెబుతోంది. ఆధ్యాత్మిక సంబంధ పర్యాటకంలో అయోధ్యను గొప్ప నగరంగా తీర్చిదిద్దాలని యూపీ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆరెస్సెస్ అధిపతి మోహన్ భగవత్ ఒకరోజు ముందుగానే అయోధ్యకు చేరుకోనున్నారు. రామాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు అయోధ్యలోని కొంతమంది ముస్లింలు కూడా సంసిద్ధమవుతున్నారు.
హిందూ సోదరులతో కలిసి వేడుకలో పాల్గొంటానని ఫైజాబాద్ జిల్లాకు చెందిన జంషెడ్‌ఖాన్ తెలిపారు.రామాలయ శంకుస్థాపనను వీడియోకాన్ఫరెన్స్ విధానంలో నిర్వహించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన సూచనను విశ్వహిందూ పరిషత్ తిరస్కరించింది. శంకుస్థాపన అంటే భూమాతను పూజించి, అనుమతి కోరడమని, దానిని ఎలక్ట్రానిక్ విధానంలో చేయలేమని స్పష్టీకరించారు.