టీడీపీ-జనసేనల మధ్య ఇంకా పొత్తు ఫిక్స్ కాలేదు..కానీ ఇప్పటినుంచే రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై రచ్చ నడుస్తోంది. పొత్తులో ఆ సీట్లు జనసేనకు దక్కుతాయని..కాదు కాదు ఆ సీట్లని వదులుకోదు అని ప్రచారం జరుగుతుంది. అసలు కొన్ని సీట్ల విషయంలో టిడిపి-జనసేనల మధ్య పంచాయితీ నడుస్తోంది. సీటు తమకంటే తమకని రెండు పార్టీల నేతలు పోటాపోటిగా ప్రకటనలు చేస్తున్నారు.
ఇదే సమయంలో గాజువాక సీటు విషయంలో రచ్చ చెలరేగింది. ఈ సీటు తమదంటే తమదని టిడిపి-జనసేన శ్రేణులు మాట్లాడుతున్నాయి. తాజాగా పవన్ గాజువాకలో సభ నిర్వహించారు. ఈ సభలో గాజువాక తనది అని, మనది అని, 2024 ఎన్నికల్లో ఇక్కడ జనసేన జెండా ఎగరడం ఖాయమని అన్నారు. దీంతో ఈ సీటు విషయంలో టిడిపి అభ్యంతరం చెబుతుంది. ఒకవేళ పొత్తు లేకపోతే ఎవరికి వారు పోటీ చేయవచ్చు. కానీ టిడిపి-జనసేన పొత్తు నేపథ్యంలో ఈ సీటు టిడిపికే దక్కుతుందని, టిడిపి నేత పల్లా శ్రీనివాసరావు ఇక్కడ బరిలో నిలుస్తారు..గెలుస్తారు అని టిడిపి శ్రేణులు అంటున్నాయి.
ఇలా గాజువాక సీటు విషయంలో రెండు పార్టీల మధ్య పంచాయితీ నడుస్తోంది. అయితే ఇక్కడ వాస్తవంగా బలాబలాలు గురించి ప్రస్తావిస్తే..ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేనలకు దాదాపు సమాన బలం ఉంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి 74 వేల ఓట్లు వస్తే..జనసేన నుంచి పవన్ పోటీ చేసి 56 వేల ఓట్లు తెచ్చుకున్నారు. టిడిపి నుంచి పల్లా పోటీ చేసి 54 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అంటే టిడిపి-జనసేన ఓట్లు దగ్గరగానే ఉన్నాయి.
ఒకవేళ పవన్ గాని పోటీ చేయకపోతే జనసేనకు అన్నీ ఓట్లు పడవని అంటున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ పవన్ పోటీ చేస్తే టిడిపి సీటు త్యాగం చేయడానికి రెడీగానే ఉంది. కానీ పవన్ కాకుండా జనసేన నుంచి వేరెవరు బరిలో ఉన్న టిడిపి గాజువాక వదులుకునే పరిస్తితి కనిపించడం లేదు. సీనియర్ నేత పల్లాకే గాజువాక సీటు అంటున్నారు. అయితే టిడిపి-జనసేన కలిస్తే ఇక్కడ వైసీపీ గెలుపు కష్టమే. చూడాలి మరి గాజువాక సీటు చివరికి ఎవరికి దక్కుతుందో.