టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయింది. దీంతో సీట్ల విషయంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జనసేనకు టిడిపి ఎన్ని సీట్లు ఇస్తుంది? జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది? అనేది క్లారిటీ లేదు. కానీ కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య పోరు నడిచేలా ఉంది. ఇదే క్రమంలో గిద్దలూరు సీటు కోసం పోటీ నెలకొనేలా ఉంది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ఆమంచి శ్రీనివాస్ రావు..మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు. ఆమంచి వైసీపీలో ఉంటే..ఆయన సోదరుడు జనసేనలో చేరిన విషయం తెలిసిందే.
ఆమంచి శ్రీనివాస్ అందరికీ స్వాములుగా మాత్రమే తెలుసు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ తన సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ గెలుపు కోసం ఇన్నాళ్లు పనిచేశారు. కానీ ఎన్నాళ్ళని సోదరుడు కోసం పనిచేయాలి నాకంటూ ఒక గుర్తింపు కావాలి అని కోరుకున్న స్వాములు ఆలోచనతో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే టిడిపి-జనసేన పొత్తులో చీరాల సీటు దక్కితే పర్లేదు. లేదంటే గిద్దలూరుపై అయినా పర్లేదు అన్నట్లు స్వాములు ఉన్నారు.
గిద్దలూరులో కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన అన్నా రాంబాబును కాపు ఓట్లే గెలిపించాయని ఆమంచి స్వాములు ఈ నిర్ణయానికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గిద్దలూరు స్థానాన్ని స్వాములు కోరుకుంటే పవన్ తనకే ఇస్తానని మాట ఇచ్చారు. ఇప్పటివరకు అయితే జనసేన, ఆమంచి స్వాములు ఇద్దరికీ సంతోషమే కానీ అసలు చర్చ ఇప్పుడే మొదలయ్యింది.
గిద్దలూరు నుండి స్వాములు పోటీ చేస్తే మరి టిడిపి గిద్దలూరు ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పరిస్థితి ఏంటి అన్నది టిడిపి నేతలు అందరిని కలవరపరుస్తుంది. చంద్రబాబు అశోక్ రెడ్డిని ఎలా చెప్పి బుజ్జగిస్తారా ఏ పదవి ఇచ్చి సర్ది చెబుతారా అని టిడిపి నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ చెప్పినట్లే చేస్తాను అని అంటూనే గిద్దలూరులో తన పట్టును పెంచుకుంటున్న స్వాములను చూస్తుంటే టిడిపి నేతలకు మింగుడు పడడం లేదు. జనసేన టిడిపిల మధ్య సీట్లు గురించి క్లారిటీ వస్తే గాని ఈ సమస్యకు పరిష్కారం లభించదు.