ముఖ్యమంత్రి జగన్ ఓ మంచి నిర్ణయాన్ని వెలువరించారు. ఆలస్యం అయినా కూడా ప్రాజెక్టుల విషయమై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ నుంచి నీళ్లు సెప్టెంబర్ నాటికి విడుదల చేయాలని ఆదేశించారు.అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన నదులు వంశధార,నాగావళి అనుసంధానం పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. ఇదే సందర్భంలో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న నేరడి బ్యారెజి పనులను సైతం ప్రారంభించాలని సూచించారు.
ఇక నెరడి బ్యారెజి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పినా సంబంధిత నిధులేవి? వాస్తవానికి బ్యారెజి నిర్మాణం పూర్తయితే ఒడిశాలో పదివేల ఎకరాలకు పైగా ప్రాంతం నీట మునిగిపోతుంది.దీనికి పరిహారం చెల్లించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇదే సందర్భంలో వారికి చెల్లించాల్సిన పరిహారం చెల్లించకుండా పనులు చేపట్టడం జరగని పని. బ్యారెజి నిర్మాణం కారణంగా ఒడిశా కు కూడా మంచి జరుగుతుంది కానీ సంబంధిత భూ సేకరణ ఒడిశానే చేయాలి. అందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పలేం. ఆ మధ్య ఇదే సమస్యపై ముఖ్యమంత్రి జగన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు. చాలా విషయాలు చర్చించారు. కానీ ఎగువన ఉన్న ఒడిశా ఎప్పటి కప్పుడు వరదల సమయంలో చెప్పాపెట్టకుండా నీటిని వదిలేస్తున్న విషయాన్నే ప్రస్తావించకుండా జగన్ తిరిగివచ్చేశారు.
మరి! నీటి విడుదలపైనే అంతటి నిర్లక్ష్యం ఉన్నప్పుడు ప్రాజెక్టు పూర్తికి ఒడిశా ఎందుకు సహకారం అందిస్తుందని? కనుక పక్క రాష్ట్రంతో ఉన్న జలవివాదాలు అంత సులువుగా పరిష్కారం కావు. అందుకు ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత ఒక్కటే కాదు ఏకాభిప్రాయ సాధన కూడా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ సర్కారు తరఫున జగన్ భరోసా ఇస్తే కాదు పరిహారం చెల్లింపుపై స్పష్టత ఇస్తేనే పనులు అవుతాయి. కానీ ఇవేవీ చేయకుండా నేరడి బ్యారెజి పనులు ప్రారంభించండి అని చెప్పడం అనేక అనుమానాలకు తావిచ్చే విషయం.