కాంగ్రెస్‌తో ఈటల రాజేందర్ కు జరిగే నష్టమెంత?

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఉప ఎన్నిక పోరుని అటు అధికార టీఆర్ఎస్, ఇటు ఈటల రాజేందర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాజాగా బీజేపీలో చేరిన ఈటల ఎలాగైనా టీఆర్ఎస్‌ని ఓడించి కేసీఆర్ గర్వం అణచడం గ్యారెంటీ అంటున్నారు. అలాగే ఈటలకు చెక్ పెట్టి హుజూరాబాద్ టీఆర్ఎస్‌కు కంచుకోట అని నిరూపిస్తామని గులాబీ నేతలు చెబుతున్నారు.

ఈటల రాజేందర్

అయితే వీరి ఇద్దరి పోరులో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్‌లో గెలవడం కష్టమని తెలిసిపోతుంది. కాకపోతే ఆ పార్టీకి నియోజకవర్గంలో బాగానే బలం ఉంది. దీంతో ఆ పార్టీ ఓట్లు చీల్చి ఎవరికి నష్టం చేకూరుస్తుందనేది చూడాలి. ప్రస్తుతం ఆ పార్టీ తరుపున పోటీ చేయడానికి కౌశిక్ రెడ్డి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో కౌశిక్ కాంగ్రెస్ నుంచే పోటీ చేసి, ఈటలపై 43 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు.

కానీ ఈ సారి కూడా తానే కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటానని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని హుజూరాబాద్ ప్రజలని కోరుతున్నారు. అయితే కౌశిక్ ఇటీవలే మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. దీంతో ఆయన టీఆర్ఎస్‌లోకి వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. పైగా అధికార టీఆర్ఎస్‌ని కాకుండా, ఈటలని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.

దీని వల్ల కౌశిక్ టార్గెట్ కూడా ఈటల రాజేందర్ అని అర్ధమవుతుంది. కౌశిక్‌కు పడే ఓట్లు అధికార పార్టీకి వ్యతిరేకమైనవే అని చెప్పొచ్చు. అలా కాంగ్రెస్ ఓట్లు చీల్చిస్తే ఈటల గెలుపుకు గండికొట్టే ప్రమాదం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. అలా కాకుండా టీఆర్ఎస్ వర్సెస్ ఈటల అని ప్రజలు భావించి, కాంగ్రెస్ వైపుకు వెళ్లకుండా ఉంటే పెద్దగా ఓట్లు చీలే ప్రమాదం ఉండదు. చూడాలి మరి హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓట్లు చీల్చి ఎవరికి నష్టం చేస్తుందో?

Read more RELATED
Recommended to you

Latest news