టీఆర్ఎస్‌కు హుజూర్‌న‌గ‌ర్ షాక్‌… మ‌రో నిజామాబాద్ కానుందా..!

-

తెలంగాణ‌లో హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నికకు న‌గారా మోగింది. అయితే, ఇదేదో సాధార‌ణంగా జ‌రిగే ఉప ఎన్నిక మాదిర‌గా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల విధానాల‌ను వ్య‌తిరేకిస్తూ.. కీల‌క నేత‌లు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రైతులు, ఆందోళ‌న కారులు కూడా పోటీ చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల స‌మ‌యంలో నిజామాబాద్‌లో రైతులు దండెత్తారు. ప‌సుపు బోర్డు ఏర్పాటును డిమాండ్ చేస్తూ.. వారు కూడా భారీ సంఖ్య‌లో ఎన్నిక‌ల్లో పోటీకి నిలిచారు. అప్ప‌ట్లో ఈ వార్త సంచ‌ల‌నంగా మారింది.

ఆ ఎన్నిక‌ల్లో రైతులు అంద‌రూ క‌లిసి ఏకంగా 95 వేల ఓట్లు చీల్చ‌డంతోనే కేసీఆర్ కుమార్తె క‌విత 70 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక‌, కేంద్రంలో న‌రేంద్ర మోడీకి కూడా ఈ త‌ర‌హా వేడి త‌గిలింది., వార‌ణాసిలో ఆయ‌నకు పోటీగా తెలంగాణ‌, త‌మిళ‌నాడు రైతులు భారీ ఎత్తున నామినేష‌న్లు వేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే, చివ‌రి నిముషంలో రంగంలోకి దిగిన కీల‌క నాయ‌కులు రైతుల‌ను స‌ర్దు బాటు చేశారు. ఇక‌, ఇప్పుడు ఇదే విష‌యం మరోసారి తెర‌మీదికి వ‌స్తోంది. త్వ‌ర‌లోనే తెలంగాణ‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం హుజూర్‌న‌గ‌ర్‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి నామినేష‌న్ వేసేందుకు ఈ నెల 30 వ‌ర‌కు గ‌డ‌వు ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇక్కడ నామినేష‌న్ వేసేందుకుఏకంగా 251 మంది స‌ర్పంచులు రెడీ కావ‌డం, ర్యాలీగా త‌ర‌లి వ‌చ్చి మ‌రీ నామినేష‌న్ల‌ను వేసేందుకు సిద్ధం కావడం  రాజ‌కీయ పార్టీల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ప‌రిణామం. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల పట్ల వివక్ష చూపుతోందంటూ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో 251 మంది సర్పంచ్‌లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.  తద్వారా సర్కారుకు తమ సత్తా చాటుతామని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో వీరంతా నామినేష‌న్లు వేసేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో ర్యాలీగా రానున్నారు.

ఇక అదే టైంలో లాయ‌ర్లు సైతం భారీ ఎత్తున ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. మరి ప్ర‌భుత్వం ముఖ్యంగా ఈ సీటును సొంతం చేసుకునేందుకు తాప‌త్ర‌యం ప‌డుతున్న నాయ‌కులు ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news