భారతదేశ చరిత్ర అతి ప్రాచీనమైనది, మహోన్నతమైనది అనటానికి నిలువెత్తు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి విశిష్టమైన నిర్మాణాలు దేశంలోని ప్రతిమూలలో ఉన్నాయి. అధునాతన ఇంజినీరింగ్‌కు సవాలుగా నేటికి నిల్చి ఉన్న అద్భుత కట్టడం ఇది. ఆ దేవాలయంలో ఎల్లవేళలా ధ్వజస్తంభం నీడ దేవుడిపై పడుతూ ఉంటుంది. అలాంటి అబ్బురపరిచే దేవాలయం గురించి తెలుసుకుందాం…
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పానగల్లు అనే గ్రామం ఉంది. అక్కడ ఛాయా సోమేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా కనిపించని విశేషం ఉన్నది. అదేమిటంటే గర్భాలయంలోని శివలింగాన్ని నీడ(ఛాయ) కప్పేయడం.
ఛాయా సోమేశ్వరాలయాన్ని త్రికూటాలయం అంటారు. ఈ ఆలయంలో మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఆలయంలోని రెండు స్తంభాల్లో ఒకదాని నీడై ఉండొచ్చని భావించినా.. ఒకే నీడ రెండు స్తంభాలకు మధ్యలో ఉండే గర్బగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతోంది. దీంతో ఈ నీడ దేనిదనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
ఈ ఆలయంలోని మూడు గర్బ గుడులు కూడా ఒకేరీతిగా ఉంటాయి. అయితే, పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపిస్తుంది. భక్తులంతా ఇది దేవుడి మాయ అని నమ్ముతారు. ఈ ఆలయ శిల్పి.. గర్బగుడిలో పడే నీడకు.. సూర్యుడి కాంతితో పనిలేకుండా పగటి వేళల్లో వెలుతురు మాత్రమే ఉపయోగపడేలా ఆలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ నీడ ఎలా ఏర్పడుతుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇటీవలే ఈ ప్రాంతానికి చెందిన యువ ఫిజిక్స్ శాస్త్రవేత్త దీన్ని ఆధునిక సిద్ధాంతం ప్రకారం నిరూపించాడు.
కానీ వందల ఏండ్ల కిందటే నేటి ఆధునిక సిద్ధాంతానికి ధీటుగా ఈ దేవాలయాన్ని నిర్మించిన ఆ దేవాలయ శిల్పులకు హ్యాట్సఫ్. వారి ఇంజినీరింగ్ ప్రతిభ దేశాన్ని గర్వపడేలా చేస్తుందంటే అచ్చెరువు పొందనవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తు నేటికి ప్రభుత్వాలు దాని సంరక్షణకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో రోజురోజుకు ఆ ప్రదేశం అంతా శిథిలమవుతుంది. అవకాశం ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ అద్భుత నిర్మాణాన్ని చూసి ఇన్‌స్పైర్ అవుతారని ఆశిద్దాం.
– కేశవ