ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పిఠాపురం నియోజకవర్గం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం చాలా సందర్భాల్లో పవన్ చెప్పుకొచ్చారు. ఆయనపై పిఠాపురం ప్రజలు కూడా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. వాటిని వమ్ము చేయకుండా కార్యాచరణలోకి దిగారు పవన్. భారీ ప్రాజెక్టులను తీసుకురావాలని భావిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే వర్క్ అవుట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. బిపిసిఎల్ రిఫైనరీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. పవన్ గట్టిగా ప్రయత్నిస్తే ఆ ప్రాజెక్టు పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటుకు మార్గం సుగమం కానున్నట్లు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మూడు రోజులపాటు ఆయన ఢిల్లీలో క్షణం తీరిక లేకుండా గడిపారు. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. అమరావతి తో పాటు పోలవరం ప్రాజెక్టులకు సాయం చేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను మంజూరు చేయాలని కూడా కోరారు. ఈ తరుణంలో కేంద్ర పెట్రోలియం సంస్థ బీపీసీఎల్ సుమారు 50 వేల కోట్లతో ప్రతిపాదించిన రిఫైనరీ ఏపీకి దక్కడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ రిఫైనరీ కోసం గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ పోటీపడ్డాయి. కానీ ఈ ప్రాజెక్టును ఏపీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 50వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ రిఫైనరీ ద్వారా మరికొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొలుత ఈ రిఫైనరీని మచిలీపట్నం పరిధిలో ఏర్పాటుకు ఆలోచించారు. కానీ తాజాగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
పిఠాపురంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఉంది. 2004లోఅప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేశారు. దాదాపు 12,500 ఎకరాల్లో దీనిని కేటాయించారు. 20 ఏళ్ల కాలంగా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. ఒకటి రెండు పరిశ్రమలను తెరిచిన ఎంతో కాలం నడవలేదు. రైతుల నుంచి సేకరించిన 12,500 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ రిఫైనరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదన వచ్చింది. ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ 50 వేల కోట్లతో భారీ ప్రాజెక్టు ఏపీకి కేటాయించడంతో.. పవన్ తన పరపతిని ఉపయోగిస్తే పిఠాపురం నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దిశగా పవన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. రిఫైనరీ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడే ఛాన్స్ కనిపిస్తోంది. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ కు గోల్డెన్ చాన్సే.