అసెంబ్లీ సీట్ల పెంపు..కేంద్రం తేలుస్తుందా?

-

రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలని పెంచాలనే హామీ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలోని 119 సీట్లను 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఉంది. అయితే ఇంతవరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో జనాభా పెరుగుతుంది. అలాగే జనాభా పెరుగదలకు తగ్గట్టుగా రెండు రాష్ట్రాల్లోనూ జిల్లాలు విభజన చేశారు.

కానీ అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో కేంద్రం ముందుకెళ్లడం లేదు. అయితే ఇటీవల జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ స్థానాలని పెంచారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలని ఎందుకు పెంచరనే డిమాండ్ వస్తుంది. ఇదే క్రమంలో తాజాగా రెండు రాష్ట్రలో అసెంబ్లీ స్థానాలని పెంచాలని చెప్పి.. పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ కె.పురుషోత్తమ్‌ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న నిబంధన మేరకు అక్కడ నియోజక వర్గాలను పెంచడానికి డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిందని, అదే నిబంధన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా కేంద్రం తగిన చర్యలు తీసుకోలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రావు రంజిత్ ఆక్షేపించారు.

ఇక ఈ పిటిషన్‌ని విచారించి… శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై కేంద్రం ఎలాంటి సమాధానం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే ఈ ఏడాది జూలైలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఎప్పుడు ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ రాజ్యసభలో ప్రశ్న వేయగా..దానికి 2026 జనాభా లెక్కలు వచ్చేవరకు సాధ్యం కాదని కేంద్రం సమాధానం ఇచ్చింది. మరి ఇప్పుడు సుప్రీంకు ఎలాంటి సమాధానం ఇస్తుందనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news