అచ్చన్న కంచుకోటలో సీన్‌ మారుతోందా ?

-

సిక్కోలు రాజకీయాల్లో కింజారపు కుటుంబానికి ఓ ప్రత్యేకస్థానముంది. టెక్కలి నియోజకవర్గం, అందులోనూ స్వగ్రామమైన నిమ్మాడ కింజారపు కుటుంబానికి కంచుకోటలాంటిది. నిమ్మాడ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి నాలుగు దశాబ్దాలుగా ఆ కుటుంబం ఏం చెబితే అదే నడుస్తోంది.
అక్కడ దశాబ్దాలుగా ఆ కుటుంబానిదే పెత్తనం. ఏ ఎన్నిక జరిగినా వారి కనుసన్నల్లో నడవాల్సిందేనట. 40 ఏళ్లుగా ఏకగ్రీవంగా పాలన సాగిస్తున్న ఆ కుటుంబానికి మొదటిసారి గట్టి సవాల్ ఎదురైంది. అచ్చన్నకు కంచుకోటలో సీన్ రివర్సవుతుందా అన్న చర్చ సిక్కోలు రాజకీయాల్లో ఊపందుకుంది.

సర్పంచ్ ఎన్నికల నుంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ వరకూ ఆఖరికి సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ నిమ్మాడలో కింజారపు కుటుంబం మాటే శాసనం అనేలా కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకూ నిమ్మాడ నుంచి ఒక్కరు కూడా వీరికి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు నిమ్మాడలో సీన్‌ మారింది. ఎప్పట్నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైసీపీ వర్గాలు నిమ్మాడ లో పోటీ చేయాల్సిందే అని డిసైడ్‌ అయ్యాయి.

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని దెబ్బకొట్టడంతో పాటు కింజారపు కోటలో పాగా వేయాలని వైసీపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న కింజారపు కుటుంబం ఆధిపత్యానికి బ్రేక్ వేసేందుకు అచ్చన్నాయుడు బంధువునే రంగంలోకి దించారు . నిమ్మాడలో వైసీపీ తరపున అచ్చెన్నాయుడికి కొడుకు వరుసైన కింజారపు అప్పన్నను తెరపైకి తీసుకొచ్చింది. అటు టీడిపి నుంచి అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ కుమారుడు సురేష్ నామినేషన్ దాఖలు చేశారు.

అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటంతో ఈ పంచాయతీ ఎన్నికను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఎలాగైనా తన స్వగ్రామం నిమ్మాడ టీడీపీకి ఏకగ్రీవం అయ్యేలా పోటీనుంచి తప్పుకోవాలని అచ్చెన్నాయుడు సైతం స్వయంగా అప్పన్నతో ఫోన్ లో మాట్లాడారు. అదే సమయంలో నామినేషన్ వేసే ఆలోచనను విరమించుకోవాలంటూ కుటుంబసభ్యులు సైతం అప్పన్న పై ఒత్తిడి రావడంతో అప్పన్న టెక్కలి వైసీపీ ఇంచార్జి దువ్వాడ శ్రీనివాస్ ను ఆశ్రయించాడు . ఇదే సమయంలో అచ్చెన్నాయుడికి తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీకై వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది .

అప్పన్నతో నామినేషన్ వేయించేందుకు స్వయంగా టెక్కలి వైసీపీ ఇంఛార్జి దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ నామినేషన్ కేంద్రానికి రావడంతో ఒక్కసారిగా వివాదం ముదిరింది. అప్పన్నతో పాటు దువ్వాడ, ఇతర వైసీపీ శ్రేణులు ఎలా వస్తారంటూ అచ్చెన్నాయుడి సోదరుడు హరిప్రసాద్, అతని వర్గీయులు గొడవకు దిగారు . దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పన్నను మాత్రమే పటిష్టమైన పోలీసు భద్రతా వలయం మధ్య తీసుకెళ్లి దగ్గరుండి పోలీసులు నామినేషన్ దాఖలు చేయించారు. దీంతో ఎట్టకేలకు పోలీసుల సాయంతో నామినేషన్ దాఖలు చేసిన అప్పన్న కింజారపు కోటలో తొలిసారి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వ్యక్తిగా నిలిచాడు.

అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంతో పాటు, దాడిచేశారనే ఫిర్యాదుతో అచ్చన్నాయుడిని అరెస్ట్ చేయడం, కోర్టుకు తరలించడం చకచకా జరిగిపోయాయట. ఐతే తాజాపరిణామాల తర్వాత నిమ్మాడలో ఏం జరగబోతోందనే విషయం పై మాత్రం జిల్లావ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. సుమారు మూడు వేల ఓటర్లున్న నిమ్మాడలో జనం ఎవరికి పట్టం కడతారోననే ఉత్కంఠ ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news