డీకే అరుణ..తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకురాలు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలం పాటు పనిచేసిన ఆమె..ఇప్పుడు బిజేపిలో ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో గెలుపుకు దూరమైన ఆమె..ఈ సారి ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే నాయకురాలుగా సొంత బలం ఉంది..కానీ బిజేపికి అనుకున్న బలం లేదు. దీంతో గద్వాల్ బరిలో ఈ సారి ఆమె నెగ్గుకు రాగలరా అనేది డౌట్ గా ఉంది.
అయితే గద్వాల్ నియోజకవర్గం చరిత్ర చూస్తే..అక్కడ ఇప్పటివరకు డికే ఫ్యామిలీ హవానే నడిచింది. డికే సత్యారెడ్డి, డికే సమరసింహారెడ్డి, డికే భరతసింహారెడ్డి, డికే అరుణ..డికే ఫ్యామిలీ నుంచి సత్తా చాటుతూనే వచ్చారు. ఇండిపెండెంట్లుగా, కాంగ్రెస్ నుంచి గెలిచారు. మధ్యలో 1985, 1999 ఎన్నికల్లో డికే ఫ్యామిలీకి టిడిపి చెక్ పెట్టింది. అరుణ 2004 నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి సీటు రాకపోవడంతో ఆమె సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేసి టిడిపిపై గెలిచారు. తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు.
ఇక 2009లో ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అలాగే మంత్రిగా పనిచేశారు. తెలంగాణ వచ్చాక 2014లో కూడా ఆమె విజయం సాధించారు. అయితే 2018 ఎన్నికల్లో ఊహించని విధంగా ఆమె ఓటమి పాలయ్యారు. బిఆర్‌ఎస్ నుంచి బి.కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేసి అరుణని ఓడించారు.
తర్వాత ఆమె బిజేపిలోకి జంప్ చేసి..2019 పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీ గా పోటీ చేసి 77 వేల ఓట్ల మెజారిటీతో బిఆర్‌ఎస్ పై ఓడిపోయారు. అయితే అరుణకు మహబూబ్‌నగర్, మక్తల్ సీట్లలో మెజారిటీ వచ్చింది. ఈ క్రమంలో ఈ సారి ఎన్నికల్లో అరుణ మహబూబ్‌నగర్ అసెంబ్లీలో పోటీ చేస్తారనే టాక్ వచ్చింది. కానీ ఆమె మళ్ళీ గద్వాల్ బరిలోనే దిగడానికి రెడీ అయ్యారు. అక్కడ బిఆర్‌ఎస్‌ని ఓడించి సత్తా చాటాలని చూస్తున్నారు. మరి ఈ సారి అరుణకు గెలుపు దక్కుతుందో లేదో చూడాలి.