“అన్నా.. దుర్గా ప్రసాద్ కుటుంబానికైనా మన నాయకుడు న్యాయం చేస్తాడా ? “ .. “కనీసం ఈ కుటుంబానికైనా న్యాయం జరుగుతుందా ?“ – ఇదీ ఇప్పుడు వైసీపీలో వినిపిస్తున్న మాట. తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి గత ఏడాది ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన దుర్గాప్రసాద్.. కొన్ని రోజుల కిందట హఠాన్మరణం చెందారు. పట్టుమని ఏడాదిన్నర కూడా తిరక్కుండానే ఆయన మృతి చెందడంతో దుర్గాప్రసాద్ కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. గతంలో టీడీపీలో ఉన్న దుర్గా ప్రసాద్.. గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పలు మార్లు విజయం సాధించారు. తర్వాత కాలంలోఆయన వైసీపీ బాటపట్టారు. ఈ క్రమంలోనే తిరుపతి ఎంపీగా రెండు లక్షల ఓట్ల మెజారిటీతతో విజయం దక్కించుకున్నారు.
అకాల మరణంతో దుర్గా ప్రసాద్ కుటుంబానికే వైసీపీ టికెట్ మళ్లీ దక్కుతుందని అనుకున్నారు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో కుటుంబంలోని వారికే టికెట్ ఇస్తారు. అయితే.. ఈ దఫా.. పోటీ భారీగా ఉండడంతోపాటు… సర్కారుకు కూడా తీవ్ర రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం కావడంతో.. వైసీపీ అధినేత ఈ టికెట్‌ను వేరేవారికి కేటాయించారు. ఈ క్రమంలోనే దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులతో జగన్ చర్చించారు. దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని.. జగన్ హామీ ఇచ్చారు. ఇదే ఇప్పుడు చర్చకు దారితీసింది. వైసీపీలోనే ప్రధానంగా ఈ విషయం చర్చకు రావడం గమనార్హం. జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనే పేరుంది.
అయితే.. ఇటీవల కాలంలో చాలా మంది నాయకులకు ఆయన హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు నెరవేర్చుకోలేక పోయారు. దీంతో ఇప్పుడు దుర్గా ప్రసాద్ కుటుంబానికి ఇచ్చిన హామీ అయినా నెరవేరేనా? అనే సందేహాలు వైసీపీలోనే చర్చకు వస్తుండడం గమనార్హం. గతలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక, ఆళ్ల రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని బహిరంగ ప్రకటనే చేశారు. అయినా కూడా నెరవేర్చలేదు. దీంతో ఇప్పుడు పార్టీలో జగన్ హామీలపై తీవ్ర సందేహాలు.. అనుమానాలు నెలకొన్నాయి. ఎవరికి వారు వీటినే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే దుర్గా ప్రసాద్ కుటుంబానికైనా న్యాయం జరుగుతుందా? అని నాయకులు చర్చించుకోవడం గమనార్హం.