టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఆయ‌న‌కేనా…! స‌న్నిహితుడికి చంద్ర‌బాబు బంప‌రాఫ‌ర్‌

-

తెలుగునాట ప్ర‌భుత్వాలు నామినేట్ చేసే ప‌ద‌వుల్లో కీల‌క పోస్ట్ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానములకు సార‌థ్యం వ‌హించే ఛైర్మ‌న్ ప‌ద‌వి. కేబినెట్ హోదాతో ల‌భించే ఈ ప‌ద‌వి కోసం పైర‌వీలు భారీగానే జ‌రుగుతుంటాయి.అయితే ప్ర‌భుత్వంలో ఉండే రాజ‌కీయ పార్టీలు మాత్రం పార్టీలోని సీనియ‌ర్‌ల‌కో లేక ధార్మిక చింత‌న క‌లిగిన వ్య‌క్తుల‌కో క‌ట్ట‌బెడుతుంటాయి. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ ఆ ప‌ద‌విలో ఎవ‌రిని కూర్చోబెడ‌తారా అనే ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు.

వైసీపీ హ‌యాంలో ఆ పార్టీకి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు టీటీడీకి ఛైర్మ‌న్‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం ఏపీకి ముఖ్య‌మంత్రిగా ఉన్న నారా చంద్ర‌బాబునాయుడు మాత్రం ఈ ప‌ద‌విపై ఆచితూచి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన న్యూస్ ఒక‌టి తెగ వైర‌ల్ అవుతోంది. అదేంటంటే టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విని సుప్రీంకోర్ట్ మాజీ చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణకు క‌ట్ట‌బెడుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ఏపీలో ఎన్‌డిఏ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక అంటే రెండు నెల‌ల‌కుపైగా టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఖాళీగా ఉంది. గతంలో ఛైర్మన్‌గా పని చేసిన భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఎన్నికల ఫ‌లితాల అనంత‌రం తన పదవికి రాజీనామా చేశారు. ఈ పోస్టును భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది.

అత్యంత కీలకమైన, ప్రతిష్ఠాత్మక పదవి కావడం వల్ల ఛైర్మన్ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత జనసేన సీనియర్ నాయకుడు, ప్రముఖ నటుడు నాగబాబు పేరు వినిపించింది. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉండటం, ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్న నేపథ్యంలో నాగబాబుకే ఖాయం కావొచ్చంటూ వార్తలొచ్చాయి. దీన్ని ఆయన తోసిపుచ్చారు. ఆ తరువాత ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేరు తెర మీదికి వచ్చింది. దాదాపుగా ఆయనకే టీటీడీ ఛైర్మన్ పదవి ఖరారైందనే ప్రచారం కొద్దిరోజుల కిందట విస్తృతంగా సాగింది. ఇప్పుడు తాజాగా ఎన్‌వీ ర‌మ‌ణ‌ పేరు ప్రచారంలోకి వచ్చింది.

సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ప‌నిచేసిన‌ జస్టిస్ ఎన్వీ రమణ ఇప్పుడు రిటైర్ అయ్యారు. తెలుగు వాడైన ఎన్వీ ర‌మ‌ణ ధార్మిక చింత‌న ఉన్న వ్య‌క్తి. ముఖ్యంగా సంస్కృతీ సంప్ర‌దాయాల‌ను కాపాడాల‌ని ఎప్పుడూ చెప్తుంటారు. ఆయ‌న‌కు చంద్ర‌బాబుతో మంచి ప్నేహం ఉంది. అయితే చంద్ర‌బాబు మాత్రం ఎన్వీర‌మ‌ణ‌తో పాటు బీఆర్ నాయుడు పేరును కూడా ప‌రిశీలిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి పేర్లే షార్ట్ లిస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరిని చంద్రబాబు టీటీడీ ఛైర్మన్ పదవి కోసం ఎంపిక చేస్తారని అంటున్నారు. చంద్రబాబు తన తొలి ప్రాధాన్యతను మాజీ సీజేఐ ఎన్వీ రమణకే ఇస్తున్నార‌ని స‌మాచారం. మ‌రో రెండు రోజుల్లో ఈ మేర‌కు ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని పార్టీవ‌ర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి చంద్ర‌బాబు త‌న స‌న్నిహితుడికి మంచి ప‌ద‌వి క‌ట్ట‌బెడుతున్నార‌ని ఏపీలో చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news