సీఎం ర‌మేష్ ఇళ్లు, కార్యాల‌యాల‌పై ఐటి సోదాలు

-

IT raids On TDP MP cm ramesh
అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన స్వగ్రామమైన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంతో పాటు హైదరాబాద్‌లోని ఇల్లు, ఆయనకు చెందిన సంస్థల కార్యాలయాల్లో సుమారు 30 మంది ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. శుక్ర‌వారం ఉదయం 8 గంటల సమయంలో పోట్లదుర్తిలోని సీఎం రమేశ్‌ నివాసానికి 15 మంది ఐటీ అధికారులు చేరుకున్నారు. ఆ సమయంలో రమేశ్‌ సోదరుడు సీఎం సురేశ్‌ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అధికారులు ఆయన్ని బయటకు పంపించివేసి ఇంటి తలుపులు మూసివేశారు. ప్రస్తుతం ఐటీ అధికారులు అన్ని గదుల్లోనూ తనిఖీలు చేపడుతూ పలు దస్త్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్‌ నివాసంతో పాటు ఆయనకు చెందిన రుత్విక్‌ అనే సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విజ‌య‌వాడ‌లోని బంద‌రు రోడ్డులో కూడా సీఎం ర‌మేష్ కార్యాల‌యం ఉంది..దానిపై కూడా ఐటి దాడులు జ‌రుగుతాయ‌ని భావిస్తున్నారు.

కక్షతోనే ఐటీ దాడులు:సీఎం రమేశ్‌, నారా లోకేష్‌
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీస్తున్నందునే తనపై కక్షతో ఐటీ దాడులు జరిపిస్తున్నారని సీఎం రమేశ్‌ ఆరోపించారు. ప్రస్తుతం ర‌మేష్ ఢిల్లీలో ఉన్నారు. ఐటీ దాడులతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ధీమా వ్య‌క్తం చేశారు.ఐటి మంత్రి నారా లోకేష్ కూడా ఐటి దాడుల‌పై స్పందించారు. తెలుగుదేశం ప్ర‌భుత్వంపై కేంద్రం క‌క్ష గ‌ట్టింద‌ని, అందులో భాగంగానే ఐటి దాడులు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news