తెలంగాణలో రైతు రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు గడుస్తున్నా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రుణమాఫీ ఎందుకు జరగడం లేదని అక్కడి రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు మర్చిపోవద్దన్నారు. శనివారం మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసింలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
కాంగ్రెస్, ఇండియా కూటమి పై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అక్కడ అంతకు ముందు ఉన్న బీజేపీ సర్కార్ రైతులకు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని ఆపేశారని ధ్వజమెత్తారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, మహా వికాస్ అఘాడిని విశ్వసించవద్దన్నారు. ఇటీవల ఢిల్లీలో రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత కేసులో ఓ కాంగ్రెస్ నేత ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని పీఎం విమర్శించారు. యువతను కాంగ్రెస్ పార్టీ మాదక ద్రవ్యాల వైపు నెట్టి ఆ సొమ్ముతో ఎన్నికలకు
ఉపయోగిస్తున్నదన్నారు.